ఒవైసీ ఆఫర్ను తిరస్కరించిన ఐఎస్ నిందితులు
ఇస్లామిక్ స్టేట్ కోసం పనిచేస్తున్నారన్న అనుమానంతో అరెస్టయిన నిందితులకు న్యాయ సహాయం అందిస్తామంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇచ్చిన ఆఫర్ను నిందితుల కుటుంబ సభ్యులు తిరస్కరించారు. మజ్లిస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, ఇతర పార్టీలతో పాటు ఇది కూడా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పెట్టిన తప్పుడు కేసును వాడుకుంటోందని ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇలియాస్ యజ్దానీ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవహక్కుల సంఘంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. కొన్నిరోజుల క్రితం దాఖలు చేసిన మరో పిటిషన్లో వాళ్లు తమకు కోటిరూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలతో పాటు హైదరాబాద్కు చెందిన ఎంఐఎం కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, మతం పేరుతో ఓట్లు పోగేసుకోడానికి ప్రయత్నిస్తోందని యజ్దానీ కుటుంబ సభ్యులు నదీరా, మహ్మద్ ఇషాక్ యజ్దానీలు తమ పిటిషన్లో తెలిపారు. వాళ్లు దేశంలోని ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఎన్ఐఏ, హోం మంత్రిత్వశాఖ, తెలంగాణ డీజీపీ, తెలంగాణ హోంశాఖ ముఖ్యకార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. వీళ్లంతా తప్పుడు కేసులు పెట్టి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.