ఇస్లామిక్ స్టేట్ నుంచి రమాదికి విముక్తి
బగ్దాద్: ఇరాక్‌లోని రమాది నగరం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఉక్కుపిడికిలి నుంచి విముక్తి పొందింది. ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ఈ నగరాన్ని తిరిగి తమ పరిధిలోకి తెచ్చుకున్నట్టు ఇరాక్ సైన్యం ప్రకటించింది. రమాదిలోని ప్రభుత్వ భవనాలపై మళ్లీ ఇరాక్ జాతీయ జెండాను రెపరెపలాడించడం ద్వారా సైన్యం చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందని భద్రతా బలగాల అధికార ప్రతినిధి బ్రిగ్ జెన్ యహ్యా రసూల్ తెలిపారు.
రమాది నగరం గత మే నెలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ మాటువేసిన ఉగ్రవాదులను తరిమేసి తిరిగి ఈ కీలక నగరాన్ని ఇరాక్ సైన్యాలు తమ అధీనంలోకి తీసుకోవడం ఐఎస్‌ఐఎస్‌కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికీ నగరంలో అక్కడక్కడ ఉన్న ఐఎస్ఐఎస్ అనుకూల శక్తులు, సాయుధులు ఇరాక్ సైన్యాన్ని ప్రతిఘటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ గతకొన్ని వారాలుగా రమాది కోసం హోరాహోరిగా పోరాడుతున్న ఇరాక్ సైన్యాలు ఇది అత్యంత కీలక విజయమని భావిస్తున్నారు. ఆదివారం నాటికే రమాదిలోని ప్రభుత్వ బంగ్లాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇరాక్ బలగాలు తాజాగా నగరంపై పూర్తి పట్టు సాధించినట్టు భావిస్తున్నారు.