Ramadi
-
అక్కడ ఉగ్రవాదులు భూగర్భం చీల్చుకుంటూ..!
రామాది(ఇరాక్): రామాది.. ఇరాక్ లో ఇది కీలక నగరం. నిత్యం దాడులకు గురవుతూ మానని గాయాలతో మూలుగుతుంటుంది. ఈ నగరాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. మరోపక్క, ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదని, ఉగ్రవాదులకు గుప్పెడు జాగ వదిలేది లేదని ఇరాక్ సేనలు చేస్తున్న పోరాటం కూడా తక్కువేం కాదు. ఇ వీరికి తోడుగా అమెరికాతో సహా ప్రపంచ దేశాల వైమానిక సేనలు వరుస బాంబులు కురిపిస్తూ చేస్తున్న సాహసం కూడా అంత ఈజీ ఏం కాదు. ఇలా, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 25శాతం రామాది ప్రాంతం ఉగ్రవాదుల చెరలోనే ఉంది. ప్రభుత్వ బలగాలు, విదేశీ సేనలు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఉగ్రవాదం నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నా ఎందుకు ఆ ప్రాంతం ఇప్పటికీ విముక్తి కాలేకపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై ఆరా తీయగా పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఊపిరి అంతా కూడా రామాది భూగర్భంలో ఉందట. అంటే వారంతా అక్కడి భూగర్బంలో పెద్దపెద్ద బొరియలు, గుహలు ఏర్పాటుచేసుకోవడంతోపాటు పెద్ద మొత్తంలో బంకర్లను కూడా ఏర్పాటుచేసుకున్నారని బయటపడింది. వారు ఆక్రమణలకు దిగే సమయంలో తప్ప ఎప్పుడూ భద్రతా బలగాలు దాడికి వచ్చినా, వైమానిక దాడులు జరిగినా వెంటనే గుట్టుచప్పుడు కాకుండా ఈ కలుగుల్లోకి, బొరియల్లోకి, బంకర్లోకి చొరబడి తమ ప్రాణాలను రక్షించుకొని టార్గెట్ చేసేవారికి కొరకరాని కొయ్యగా తయారయ్యాయని తాజాగా వెలుగుచూసిన అంశాల ఆధారంగా తెలుస్తోంది. గిరిజనులతో నిండిన రామాది ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని, వారంతా దాదాపు పది మీటర్ల దిగువున ఒకటి నుంచి రెండు మీటర్ల వెడల్పు మేర ఉండే సొరంగ మార్గాల్లో నక్కి ఉంటున్నారని తెలిసింది. ఎవరికీ అనుమానం రాకుండా వైమానిక సేనకు కనిపించకుండా ఒక ఇంటిలో నుంచి మరో ఇంటిలోకి సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకొని వాటి ద్వారా కన్నుగప్పి తిరుగుతారని కూడా వెల్లడైంది. ఇలా భూగర్భం నుంచి పలు నివాసాలను అనుసంధానం చేసుకుంటూ దాదాపు కిలో మీటర్ దూరం పొడవునా సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది. మరికొన్ని సొరంగ మార్గాలు 700 నుంచి 800 మీటర్ల పొడవు కూడా ఉన్నాయని మరికొన్ని ఆధారాలు చెబుతున్నాయి. వీటిని ధ్వంసం చేస్తే తప్ప అక్కడి ఉగ్రవాదులను ఏం చేయలేరని తెలుస్తోంది. -
ఐసిస్ చేతిలోని నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఇరాక్
-
ఇస్లామిక్ స్టేట్ నుంచి రమాదికి విముక్తి
బగ్దాద్: ఇరాక్‌లోని రమాది నగరం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఉక్కుపిడికిలి నుంచి విముక్తి పొందింది. ఐఎస్ఐఎస్ అధీనంలో ఉన్న ఈ నగరాన్ని తిరిగి తమ పరిధిలోకి తెచ్చుకున్నట్టు ఇరాక్ సైన్యం ప్రకటించింది. రమాదిలోని ప్రభుత్వ భవనాలపై మళ్లీ ఇరాక్ జాతీయ జెండాను రెపరెపలాడించడం ద్వారా సైన్యం చరిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందని భద్రతా బలగాల అధికార ప్రతినిధి బ్రిగ్ జెన్ యహ్యా రసూల్ తెలిపారు. రమాది నగరం గత మే నెలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ మాటువేసిన ఉగ్రవాదులను తరిమేసి తిరిగి ఈ కీలక నగరాన్ని ఇరాక్ సైన్యాలు తమ అధీనంలోకి తీసుకోవడం ఐఎస్ఐఎస్కు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికీ నగరంలో అక్కడక్కడ ఉన్న ఐఎస్ఐఎస్ అనుకూల శక్తులు, సాయుధులు ఇరాక్ సైన్యాన్ని ప్రతిఘటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ గతకొన్ని వారాలుగా రమాది కోసం హోరాహోరిగా పోరాడుతున్న ఇరాక్ సైన్యాలు ఇది అత్యంత కీలక విజయమని భావిస్తున్నారు. ఆదివారం నాటికే రమాదిలోని ప్రభుత్వ బంగ్లాలను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇరాక్ బలగాలు తాజాగా నగరంపై పూర్తి పట్టు సాధించినట్టు భావిస్తున్నారు. -
ఐఎస్ఐఎస్ ఖిల్లాలో ఇరాకీ సేనలు!
బగ్దాద్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు కీలక ప్రాంతంగా ఉన్న ఇరాక్‌లోని రమాది నగరాన్ని తిరిగి చేజిక్కించుకునేదిశగా ఆ దేశ సేనలు కదులుతున్నాయి. ప్రస్తుతం రమాది నగరంలోకి ఇరాకీ సేనలు ప్రవేశించాయని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రమాదిలోని ఓ బంగ్లాను తమ అధీనంలోకి తెచ్చుకున్న ఇరాకీ సేనలు నగరం నుంచి ఐఎస్ ఉగ్రవాదులను తరిమేసేందుకు దాడిని ముమ్మరం చేశాయని ఆ వర్గాలు తెలిపాయి. ఇరాక్ సేనల దాడి తీవ్రతరం కావడంతో ఐఎస్ ఉగ్రవాదులు నగరంలోని ఈశాన్య ప్రాంతం దిశగా పరారైనట్టు తెలుస్తున్నది. సున్నీ అరబ్ నగరమైన రమాది నగరం పశ్చిమ బగ్దాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎంతో కీలకమైన ఈ ప్రాంతాన్ని ఐఎస్ ఉగ్రవాదులు గత మేలో చేజిక్కించుకోవడం ఇరాక్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ నేపథ్యంలో రమాదిని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి ఇరాక్ సేనలు గత కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రమాది నగరంపై పట్టు సాధించిన ఇరాకీ సేనలు.. ఐఎస్ ఉగ్రవాదులను తరిమేస్తూ ముందుకుసాగుతున్నాయి. -
ఐఎస్ అధీనంలో కీలక నగరం
-
ఐఎస్ అధీనంలో కీలక నగరం
బీరట్: ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పాశవిక చర్యలకు పాల్పడుతున్న ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ గ్రూప్) మరో కీలక నగరాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. సిరియాకు చెందిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆదివారం రమాదీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాగ్దాద్ కు 110 కి.మీ దూరంలో ఉన్న రమాదీ నగరంలోని అధికారిక భవనాలను ఐఎస్ ఉగ్రవాదులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తొలుత పాల్ మైరా ప్రాంతాన్ని ఆక్రమించిన ఐఎస్ దళాలు అనంతరం రమాదీ నగరంలోని పలు అధికారిక భవనాలను స్వాధీనం చేసుకున్నాయి. గత సంవత్సరం ఐఎస్ ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం తరువాత ఇదే అతి పెద్ద దాడిగా అన్ బార్ ఆపరేషన్ కమాండర్ ముహున్వాద్ హైమోర్ స్పష్టం చేశారు. ఆత్మాహుతి కారు బాంబులతో నగరంలోని అధిక భాగాన్ని ఐఎస్ గ్రూపు అధీనంలోకి తీసుకున్నట్లు తెలిపారు. -
2000 కుటుంబాలు నివాసాలకు ఎడబాసి..
బాగ్దాద్: ఉగ్రవాదులు, సైన్యం మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణల కారణంగా దాదాపు రెండు వేల కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోయాయని ఇరాక్ అధికారులు ప్రకటించారు. అండార్ ప్రావిన్స్ రాజధాని రామాది ప్రాంతం సమీపంలోకి ఉగ్రవాదులు చొచ్చుకొని రాగా వారిని నిలువరించేందుకు ఇరాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భారీ బాంబు దాడులు చోటుచేసుకోవడంతోపాటు, దాడులు, ఘర్షణలతో భయానక వాతావరణం ఏర్పడింది. నివాసాల్లోకి చొరబడి ఇస్లామిక్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తుండటంతో వారు తమ నివాసాలను వదిలి వేరే ప్రాంతాలకు వలస పోయారు. ఆ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, వారికోసం ప్రత్యేక షెల్టర్లు, ఆహారం ఇతర సహాయక పరికరాలు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రామాదికి సమీపంలోని మూడు గ్రామాలను ఇస్లామిక్ స్టేట్ ఆక్రమించింది. -
75 మంది అల్ ఖైదా తీవ్రవాదులు హతం
ఇరాక్‌లో అల్ ఖైదా తీవ్రవాదులకు గట్టి దెబ్బ తగిలింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రత దళాలు, స్థానిక గిరిజనులతో జరిగిన పోరులో శుక్రవారం దాదాపు 75 మంది అల్ ఖైదా తీవ్రవాదులు హతమైయ్యారని స్థానిక మీడియా శనివారం వెల్లడించింది. అల్ ఖైదా ముఖ్య నేతల్లో ఒకరైన అబ్దుల్ రెహ్మన్ అల్ బగ్దాదీ కూడా ఉన్నారని తెలిపింది. అనబర్ ప్రొవెన్షియల్ రాజధాని నగరమైన రమదిలో 52 తీవ్రవాదులు మరణించారని, ఆ ప్రాంతానికి పరిసరాల్లో జరిగిన పోరులో మరో 23 మంది మరణించారని వివరించింది. బాగ్దాద్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రమదీ, ఫజుల్లా నగరాల్లో అటు భద్రత దళాలు, స్థానికులు ఇటు తీవ్రవాదుల మధ్య పోరు నిరంతరాయంగా కొనసాగుతుందని మీడియా పేర్కొంది.