అక్కడ ఉగ్రవాదులు భూగర్భం చీల్చుకుంటూ..!
రామాది(ఇరాక్): రామాది.. ఇరాక్ లో ఇది కీలక నగరం. నిత్యం దాడులకు గురవుతూ మానని గాయాలతో మూలుగుతుంటుంది. ఈ నగరాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. మరోపక్క, ఈ ప్రాంతాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రసక్తి లేదని, ఉగ్రవాదులకు గుప్పెడు జాగ వదిలేది లేదని ఇరాక్ సేనలు చేస్తున్న పోరాటం కూడా తక్కువేం కాదు. ఇ వీరికి తోడుగా అమెరికాతో సహా ప్రపంచ దేశాల వైమానిక సేనలు వరుస బాంబులు కురిపిస్తూ చేస్తున్న సాహసం కూడా అంత ఈజీ ఏం కాదు.
ఇలా, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అక్కడ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. దాదాపు 25శాతం రామాది ప్రాంతం ఉగ్రవాదుల చెరలోనే ఉంది. ప్రభుత్వ బలగాలు, విదేశీ సేనలు ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఉగ్రవాదం నుంచి విడిపించేందుకు ప్రయత్నిస్తున్నా ఎందుకు ఆ ప్రాంతం ఇప్పటికీ విముక్తి కాలేకపోతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయంపై ఆరా తీయగా పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఊపిరి అంతా కూడా రామాది భూగర్భంలో ఉందట. అంటే వారంతా అక్కడి భూగర్బంలో పెద్దపెద్ద బొరియలు, గుహలు ఏర్పాటుచేసుకోవడంతోపాటు పెద్ద మొత్తంలో బంకర్లను కూడా ఏర్పాటుచేసుకున్నారని బయటపడింది.
వారు ఆక్రమణలకు దిగే సమయంలో తప్ప ఎప్పుడూ భద్రతా బలగాలు దాడికి వచ్చినా, వైమానిక దాడులు జరిగినా వెంటనే గుట్టుచప్పుడు కాకుండా ఈ కలుగుల్లోకి, బొరియల్లోకి, బంకర్లోకి చొరబడి తమ ప్రాణాలను రక్షించుకొని టార్గెట్ చేసేవారికి కొరకరాని కొయ్యగా తయారయ్యాయని తాజాగా వెలుగుచూసిన అంశాల ఆధారంగా తెలుస్తోంది. గిరిజనులతో నిండిన రామాది ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారని, వారంతా దాదాపు పది మీటర్ల దిగువున ఒకటి నుంచి రెండు మీటర్ల వెడల్పు మేర ఉండే సొరంగ మార్గాల్లో నక్కి ఉంటున్నారని తెలిసింది.
ఎవరికీ అనుమానం రాకుండా వైమానిక సేనకు కనిపించకుండా ఒక ఇంటిలో నుంచి మరో ఇంటిలోకి సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకొని వాటి ద్వారా కన్నుగప్పి తిరుగుతారని కూడా వెల్లడైంది. ఇలా భూగర్భం నుంచి పలు నివాసాలను అనుసంధానం చేసుకుంటూ దాదాపు కిలో మీటర్ దూరం పొడవునా సొరంగ మార్గాలు ఏర్పాటుచేసుకున్నట్లు తెలిసింది. మరికొన్ని సొరంగ మార్గాలు 700 నుంచి 800 మీటర్ల పొడవు కూడా ఉన్నాయని మరికొన్ని ఆధారాలు చెబుతున్నాయి. వీటిని ధ్వంసం చేస్తే తప్ప అక్కడి ఉగ్రవాదులను ఏం చేయలేరని తెలుస్తోంది.