2000 కుటుంబాలు నివాసాలకు ఎడబాసి..
బాగ్దాద్: ఉగ్రవాదులు, సైన్యం మధ్య నిత్యం జరుగుతున్న ఘర్షణల కారణంగా దాదాపు రెండు వేల కుటుంబాలు తమ నివాసాలను ఖాళీ చేసి వెళ్లిపోయాయని ఇరాక్ అధికారులు ప్రకటించారు. అండార్ ప్రావిన్స్ రాజధాని రామాది ప్రాంతం సమీపంలోకి ఉగ్రవాదులు చొచ్చుకొని రాగా వారిని నిలువరించేందుకు ఇరాక్ సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ ప్రాంతాల్లో భారీ బాంబు దాడులు చోటుచేసుకోవడంతోపాటు, దాడులు, ఘర్షణలతో భయానక వాతావరణం ఏర్పడింది.
నివాసాల్లోకి చొరబడి ఇస్లామిక్ ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తుండటంతో వారు తమ నివాసాలను వదిలి వేరే ప్రాంతాలకు వలస పోయారు. ఆ పరిస్థితి చాలా దయనీయంగా మారిందని, వారికోసం ప్రత్యేక షెల్టర్లు, ఆహారం ఇతర సహాయక పరికరాలు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే రామాదికి సమీపంలోని మూడు గ్రామాలను ఇస్లామిక్ స్టేట్ ఆక్రమించింది.