
'ఐసిస్ ప్రమాదకర ఆయుధం'
న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్ లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, ఆ దేశం నుంచి కార్యకలాపాలు సాగిస్తోన్న ఉగ్ర సంస్థల్ని అదుపుచేయడం లేదని అఫ్ఘాన్ మాజీ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ విమర్శించారు. అఫ్ఘాన్ లో ఉగ్రవాదం పెరుగుదల, ప్రాంతీయంగా ఆ దేశం పాత్రపై చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ.. తమ దేశంలో సాగుతున్న పరోక్ష యుద్ధంతో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.
బలూచిస్తాన్‌పై మోదీ వ్యాఖ్యల్ని ఆహ్వానించారు. బలూచిస్తాన్ అంశాన్ని కొంతవరకూ తాము అర్థం చేసుకోవడం వల్ల ప్రధాని వ్యాఖ్యల్ని ప్రశంసిస్తున్నామని చెప్పారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో నిజాయతీగా భారత్ సహకరిస్తోందన్నారు. ప్రాంతీయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఉగ్రవాదం అతిపెద్ద సవాలుగా మారిందని, దాన్ని ఓడించేందుకు ఉమ్మడిగా పోరాడాలని సూచించారు.
చైనా కూడా మంచి పొరుగుదేశంగా ఉందని అయితే భారత్‌తో ఉన్నంత సన్నిహిత సంబంధాలు లేవన్నారు. నాలుగు ఎంఐ 25 హెలికాఫ్టర్లతో పాటు అఫ్ఘాన్ భద్రతా దళాలకు భారత్ శిక్షణ సాయం అందించిందని చెప్పారు. ఐసిస్ ప్రమాదకర ఆయుధమని, దాన్ని ప్రోత్సహిస్తోన్న వారికి వ్యతిరేకంగా అది పనిచేస్తుందని హెచ్చరించారు.