Kabul Airport Blast 2021: కాబూల్‌ రక్తసిక్తం... 72 మంది మృతి! - Sakshi
Sakshi News home page

Kabul Airport Blast: కాబూల్‌ రక్తసిక్తం:100 మందికి పైగా మృతి!

Published Fri, Aug 27 2021 3:31 AM | Last Updated on Sat, Aug 28 2021 8:30 AM

Kabul airport in a suicide bomb attack - Sakshi

కాబూల్‌: భయపడినంతా జరిగింది. కాబూల్‌ రక్తమోడింది. దేశాన్ని వదిలి వెళుతున్న పాశ్చాత్యులు, అఫ్గాన్ల లక్ష్యంగా కాబూల్‌లోని హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం చీకటి పడుతున్న వేళ ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటివరకూ ఈ రెండు బాంబుపేలుళ్లలో 100 మందికిపైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 90 మంది అఫ్గాన్‌ జాతీయులే ఉండగా, 13 మంది వరకూ అమెరికా దేశానికి చెందిన వారు ఉన్నారు. చదవండి: ఇటలీ విమానంపై కాల్పులు

విమానాశ్రయంలో పేలుడు దృశ్యం

ఇది ఇస్లామిక్‌ స్టేట్‌ – ఖోరాసన్‌ (ఐసిస్‌–కె) ఉగ్రమూక దుశ్చర్యగా భావిస్తున్నారు. కాబూల్‌ విమానాశ్రయానికి ఉగ్రముప్పు పొంచివుందని, ఆ పరిసరాల్లో ఎవరూ ఉండొద్దని... సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని అమెరికా, బ్రిటన్‌ సహా పలు పాశ్చాత్య దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే బాంబుల మోతతో కాబూల్‌ దద్దరిల్లింది. ఆత్మాహుతి దాడితో పాటు విమానాశ్రయానికి వచ్చిన వారిపై తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడినట్లుగా సమాచారం అందుతోంది. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని... బిక్కుబిక్కుమంటూ విమానాశ్రయంలోకి ప్రవేశం కోసం వేచిచూస్తున్న అఫ్గాన్లు, విదేశీయులు ఈ దాడితో తీవ్రంగా భయకంపితులయ్యారు. ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. చదవండి: అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది


రక్తమోడుతున్న ఓ అఫ్గాన్‌ పౌరుడు
విమానాశ్రయం ప్రధాన ద్వారం అబే గేటు వద్ద రాత్రి 6.45 గంటలకు తొలి ఆత్మాహుతి దాడి జరిగింది. అక్కడ వేల సంఖ్యలో జనం గుమిగూడి ఉండటంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది. సాధారణ పౌరులతో పాటు అమెరికా భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 11 మంది అమెరికా మెరైన్‌ దళ సభ్యులు, వైద్య బృందంలో ఒకరు కలిపి మొత్తం 12 మంది అమెరికా సిబ్బంది చనిపోయారని అమెరికా ధ్రువీకరించింది. రెండోదాడి అబే గేటుకు సమీపంలోకి బారన్‌ హోటల్‌ గేటు వద్ద రాత్రి 8 గంటలకు జరిగింది. ఇక్కడ 52 మంది గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కాబూల్‌ ఎమర్జెన్సీ ఆసుపత్రిలో ఇప్పటిదాకా 60 మంది క్షతగాత్రులు చేరారు. పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బీ అమెరికన్‌ భద్రతా సిబ్బంది మరణించినట్లు, గాయపడ్డట్లు ధ్రువీకరించారు.


క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
విమానాశ్రయం గేటు వద్ద జరిగిన పేలుడులో పెద్ద సంఖ్యలో జనం మరణించారని, క్షతగాత్రులయ్యారని ప్రత్యక్షసాక్షి అదమ్‌ ఖాన్‌ తెలిపారు. చాలామంది కాళ్లు, చేతులు తెగిపడ్డాయన్నారు. గాయపడ్డ మహిళలు రక్తమోడుతూ రోదించడం, చిన్నారుల ఆక్రందనలతో సంఘటనా స్థలం వద్ద భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయం ప్రహరీగోడను ఆనుకొని ఉన్న మురికి కాలువలో దిగి... అమెరికా బలగాలను తమను లోనికి అనుమతించాలని బతిమాలుతున్న అఫ్గాన్లపై ఆత్మాహుతి బాంబర్‌ దూసుకెళ్లి పేల్చి వేసుకున్నాడు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నిఘా, భద్రతావర్గాలు తాజా పరిస్థితిని వివరించాయి. బైడెన్‌ తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విమానాశ్రయం అమెరికా బలగాల అధీనంలోనే ఉందని, లోపల య«థావిధిగా తరలింపు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని పెంటగాన్‌వర్గాలు చెప్పాయి.  


అమెరికా అధీనంలోని ప్రాంతంలోనే: తాలిబన్లు
ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు. ఈ బాంబుపేలుళ్లు అమెరికా నియంత్రిత ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయని తాలిబన్‌ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్‌ తెలిపారు. తాము ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని... ఎయిర్‌పోర్ట్‌ భద్రతపై నిశితంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌ను స్థావరంగా వాడుకోవడానికి అనుమతించబోం’ అని జబీహుల్లా ప్రకటించారు. ఐసిస్‌ ఆత్మాహుతి దాడులకు తెగబడవచ్చని తామే అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు.  

హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 5,800 మంది అమెరికా సైనికులు, వెయ్యిమంది దాకా బ్రిటన్‌ సైన్యం, ఇతర నాటో దళాలు ఉన్నాయి. ఆగస్టు 31వ తేదీలోగా ఈ బలగాల ఉపసంహరణ పూర్తికావాలని... గడువు పొడిగించే సమస్య లేదని తేల్చిచెప్పిన తాలిబన్లు... విమానాశ్రయం అన్ని వైపుల నుంచీ మోహరించి ఉన్నారు. ఒప్పందం మేరకు విమానాశ్రయం లోనికి వెళ్లే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. అయితే ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న అఫ్గాన్లను అడ్డుకుంటున్నారు. ఇళ్లకు తిప్పిపంపేస్తున్నారు. గాల్లోకి కాల్పులు జరిపి వేలాదిగా విమానాశ్రయానికి తరలివస్తున్న అఫ్గాన్లను చెదరగొడుతున్నారు. గురువారం వీరిపై వాటర్‌ క్యానన్లను కూడా ప్రయోగించారు.   

ఆయుధాలు చేజిక్కించుకొని...
ఐసిస్‌(కె) కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ. తాలిబన్లను మించి ఇస్లామిక్‌ అతివాద భావజాలం. ఐసిస్‌కు తాలిబన్లతో తీవ్రవైరముంది. అంతర్జాతీయ ప్రకంపనలు సృష్టించడం, తాలిబన్లను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడం లక్ష్యంగా ఐసిస్‌ ఈ దాడులకు వ్యూహరచన చేసినట్లు కనపడుతోంది. తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుంటూ వస్తున్న క్రమంలో ఆయా ఫ్రావిన్సుల్లోని జైళ్లలో ఉన్న ఖైదీలందరినీ విడుదల చేశారు. వీరిలో తాలిబన్లతో పాటు ఐసిస్‌ ఉగ్రవాదులు ఉన్నారు. వీరందరూ బయటపడి... అస్త్రసన్యాసం చేస్తున్న అఫ్గాన్‌ సైనికుల ఆయుధాలను చేజిక్కించుకున్నారని... కొద్దికాలంలోనే బాగా బలపడ్డారని తెలుస్తోంది.

ఆగస్టు 31లోగా బలగాల ఉపసంహరణ పూర్తిచేస్తామని, ఆలోగా హమీద్‌ కర్జాయ్‌ విమానాశ్రయం జోలికి రావొద్దని అమెరికా – తాలిబన్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. రాజకీయ, భద్రతా చానళ్ల ద్వారా తాలిబన్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ... అమెరికన్లను, నాటో దళాలకు సహాయపడ్డ అఫ్గాన్లను ఆగమేఘాలపై తరలిస్తోంది. గడువు సమీపిస్తున్న కొద్దీ తరలింపులో వేగం పెంచింది. చరిత్రలోనే అతిపెద్ద ఎయిర్‌లిఫ్ట్‌గా భావిస్తున్న ఆపరేషన్‌లో మంగళవారం 19 వేల మందిని, బుధవారం 13,400 మందిని సురక్షితంగా కాబూల్‌ బయటకు తరలించింది. 4,500 మంది అమెరికన్లను తరలించగా... మరో 1,500 మంది అమెరికన్లు ఇంకా కాబూల్‌లోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ గురువారం చెప్పారు.

భారతీయులందరినీ తరలిస్తాం
అఖిలపక్ష భేటీలో విదేశాంగ మంత్రి జై శంకర్‌
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయి ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. అఫ్గాన్‌లో పరిస్థితులు సంక్లిష్టంగా మారిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో జై శంకర్‌ విపక్ష నాయకులకు అఫ్గాన్‌లో పరిస్థితుల్ని వివరించారు. ఈ భేటీకి 31 పార్టీల నుంచి 37 మంది నాయకులు హాజరయ్యారు. జై శంకర్‌తో పాటుగా కేంద్రమంత్రి, రాజ్యసభ నాయకుడు పీయూష్‌ గోయెల్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి పాల్గొన్నారు.

ఇక విపక్షాల నుంచి ఎన్సీపీ నాయకుడు శరద్‌ పవార్, రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్, డీఎంకేకు చెందిన టి.ఆర్‌.బాలు తదితరులు హాజరయ్యారు. అనంతరం జైశంకర్‌ మాట్లాడారు. అఫ్గాన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు తాలిబన్ల పట్ల కేంద్రం తన వైఖరిపై ఒక నిర్ణయానికి రాలేదని అన్నారు. ‘మా ముందున్న అతి పెద్ద కార్యక్రమం భారతీయులందరినీ తరలించడం. అఫ్గాన్‌తో స్నేహసంబంధాలను కొనసాగించడమూ మా ముందున్న లక్ష్యం’ అని జై శంకర్‌ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement