కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్వదేశానికి బయల్దేరుతున్న అమెరికా సైనికులు. (ఇన్‌సెట్లో) కాబూల్‌లో రాకెట్ ట్యూబ్‌లున్న కారును పేల్చేసిన దృశ్యం
కాబూల్: అఫ్గాన్ రాజధానిలోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా సోమవారం రాకెట్ దాడులు జరిగాయి. అయితే ఆధునిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను తిప్పికొట్టడంతో రాకెట్లు సమీపంలోని సలీం కార్వాన్ ప్రాంతంలో కూలిపోయినట్లు తెలిసింది. దాడుల్లో ఎవరూ గాయపడినట్లు తెలియరాలేదు. తొలుత దాడులకు ఎవరు కారణమన్నది తెలియరాలేదు, కానీ తామే దాదాపు ఆరు కత్యూషా రాకెట్లు పేల్చామని ఐసిస్ గ్రూప్ ప్రకటించుకుంది. ఒకపక్క రాకెట్ దాడులు జరుగుతున్నా అమెరికా దళాల ఉపసంహరణ కొనసాగింది.
అమెరికన్లను తీసుకుపోయేందుకు వచ్చిన సీ–17 కార్గో జెట్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు కొనసాగాయి. ఐసిస్, ఇతర ఉగ్ర సంస్థలు ఎయిర్‌పోర్ట్‌పై దాడులకు యత్నిస్తూనే ఉన్నాయి. రాజధానిలోని చహరె షహీద్ ప్రాంతం నుంచి తాజా రాకెట్ దాడి జరిగినట్లు అనుమానాలున్నాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు ఉపయోగించి వదిలివెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఇందులో రాకెట్ ట్యూబులను కనుగొన్నారు. రాకెట్ల రవాణాకు ఈ ట్యూబులను టెర్రరిస్టులు ఉపయోగిస్తుంటారు. దాడులకు గురైన సలీం కార్వాన్ ప్రాంతం ఎయిర్‌పోర్టుకు 3 కి.మీ.ల దూరంలో ఉంది.
ఇతర గ్రూపులతో భయాలు
సరైన పత్రాలున్నవారు అఫ్గాన్ వీడేందుకు అనుమతిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు యూఎస్ ప్రపంచ దేశాలకు తెలియజేసింది. అమెరికా దళాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత కూడా సాధారణ ప్రయాణాలకు విమానాశ్రయాన్ని అనుమతిస్తామని తాలిబన్లు తెలిపారు. పాశ్చాత్య దళాలు తమ దేశం విడిచి సురక్షితంగా వెళ్లేందుకు తాము సహకరిస్తామని తాలిబన్లు హామీ ఇచ్చినా, ఇతర టెర్రరిస్టు గ్రూపులతో యూఎస్ దళాలకు ప్రమాదం పొంచిఉంది. తాలిబన్లు పాలన చేపట్టాక పలువురు ఖైదీలను విడుదల చేశారు.
వీరిలో ఐసిస్–కె టెర్రరిస్టులు ఉన్నారు. వీరంతా యూఎస్ దళాలపై దాడులకు ప్రస్తుతం యత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదివారం సైతం ఐసిస్ తీవ్రవాదులు కాబూల్ విమానాశ్రయంపై దాడికి యత్నించగా, అమెరికా దళాలు తిప్పికొట్టాయి. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మరణించారు. మంగళవారం నాటికి పూర్తిగా అఫ్గాన్ నుంచి బయటపడాలని అమెరికా యత్నిస్తోంది. సోమవారం రాకెట్ దాడులను తమ సీర్యామ్ వ్యవస్థ తిప్పికొట్టిందని అమెరికా ప్రతినిధి బిల్ అర్బన్ తెలిపారు. దారిలోనే ఐదు రాకెట్లను తమ వ్యవస్థ ధ్వంసం చేసిందన్నారు.
అమెరికా డ్రోన్ దాడుల్లో ఏడుగురు మరణించారు
కాబూల్‌లో ఆత్మాహుతి బాంబర్‌పై ఆదివారం అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో ఏడుగురు సాధారణ పౌరులు మరణించారని తాలిబన్లు వెల్లడించారు. ఏదైనా దాడి చేపట్టే ముందు తమకు సమాచారమిస్తే బాగుండేదని, విదేశీగడ్డపై అమెరికా ఇలాంటి చర్యలకు దిగడం చట్ట విరుద్ధమని తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా చైనా అధికార టీవీ ఛానల్ ‘సీజీటీఎన్’తో అన్నారు. అఫ్గాన్ గడ్డపై ఏదైనా ముప్పు పొంచివుంటే అమెరికా మాకు చెప్పాల్సింది. ఇలా ఏకపక్షదాడులకు దిగడం సరికాదు’ అని జబీహుల్లా పేర్కొన్నారు. పౌరులు మృతి చెందారనే వార్తలపై దర్యాప్తు చేస్తున్నామని పెంటగాన్ తెలిపింది.
మతాధికారి జద్రాన్ అరెస్ట్
అఫ్గాన్‌లో తమను వ్యతిరేకించే ప్రముఖుల అరెస్ట్‌ల పర్వాన్ని తాలిబన్లు కొనసాగిస్తున్నారు. అఫ్గాన్‌లో ప్రముఖ మతాధికారి (మౌల్వీ) మొహమ్మద్ సర్దార్ జద్రాన్‌ను అరెస్ట్ చేసినట్ల తాలిబన్లు తాజాగా ధ్రువీకరించారు. అఫ్గాన్‌లో మతాధికారుల జాతీయ మండలికి ఆయన గతంలో అధ్యక్షునిగా సేవలందించారు. ఆయనను బంధించి, కళ్లకు గంతలు కట్టిన ఫొటోను తాలిబన్లు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment