ఐఎస్ ను కాపాడుతున్నది అమెరికానే!
మాస్కో: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సిరియా ఆర్మీ లక్ష్యంగా దాడులు చేసి.. 62మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంపై రష్యా భగ్గుమంది. అమెరికా విచక్షణారహితంగా సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతున్నదని, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నదని మండిపడింది. ఈ వ్యవహారంపై వెంటనే ఐరాస భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేసింది.
'గతంలో అల్ నస్రా దళాన్ని (అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద దళం) అమెరికా రక్షిస్తున్నదేమో అన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజు జరిగిన వైమానిక దాడులతో ఆ అనుమానం పటాపంచలైంది. అమెరికా ఏకంగా ఐఎస్ ను కాపాడుతున్నది' అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో చెప్పారు.
తాజా వైమానిక దాడులపై భద్రతా మండలిలో అమెరికా సమగ్ర వివరణ ఇవ్వాల్సిందేనని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సిరియాలోని డీర్ అల్ జర్ లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లో 62మంది సిరియా సైనికులు మరణించారు. 100మందికిపైగా గాయాలయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలను ఏరిపారేస్తున్న సిరియా సేనలు లక్ష్యంగా అమెరికా దాడులు జరుపుతున్నదని, తద్వారా పరోక్షంగా ఐఎస్ కు అమెరికా అండగా నిలబడుతున్నదని రష్యా మండిపడింది.