ఉగ్రవాదులను వేడుకొంటున్న సోఫీ కుటుంబసభ్యులు
శ్రీనగర్: కశ్మీర్‌కు చెందిన మరో యువకుడు ఉగ్రవాదుల్లో చేరాడు. గ్రేటర్ నోయిడాలోని శారద విశ్వవిద్యాలయంలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుకుంటున్న అహ్‌తెసామ్ బిలాల్ సోఫీ(17) ఇస్లామిక్‌స్టేట్ ఆఫ్ జమ్మూకశ్మీర్(ఐఎస్‌జేకే) ఉగ్రసంస్థలో చేరాడు. ఐఎస్ జెండా ముందు బిలాల్ దిగిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. శ్రీనగర్‌కు చెందిన సోఫీ నోయిడాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లేందుకు వర్సిటీ అధికారుల నుంచి అనుమతి తీసుకుని అక్టోబర్ 28న వర్సిటీ నుంచి బయలుదేరిన సోఫీ అదృశ్యమయ్యాడు.
దీంతో కుటుంబసభ్యులు నోయిడాతో పాటు శ్రీనగర్‌లోని ఖన్యార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని దయచేసి ఇంటికి పంపాలని ఉగ్రవాదులను వేడుకుంటూ సోఫీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సోఫీ తండ్రి బిలాల్ ఓ వీడియోలో ఉగ్రవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘మా మీద దయ చూపండి. దయచేసి నా కుమారుడిని ఇంటికి పంపండి. మా మొత్తం కుటుంబంలో ఏకైక మగ సంతానం అతడే. సోఫీ.. మన కుటుంబంలోని 12 మందికి నువ్వే దిక్కు. గత రెండేళ్లలో మన కుటుంబంలో నలుగురిని పోగొట్టుకున్న సంగతి మర్చిపోయావా?’ అని అన్నారు. ఇంటికి రావాల్సిందిగా తల్లి సైతం కొడుకును వీడియోలో కోరింది.
Comments
Please login to add a commentAdd a comment