విశాఖ,సాక్షి: విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా లెక్చరర్ వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ కాలేజీలో చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి శుక్రవారం ఉదయం తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతన్ని ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు అప్పటికే సాయి తేజ మృతి చెందినట్లు ధృవీకరించారు.
సమత డిగ్రీ కాలేజీలో చదువుతున్న సాయి తేజ అనే విద్యార్థి, శుక్రవారం ఉదయం తన నివాసంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు.
సాయి తేజ మృతికి కాలేజీ మహిళా లెక్చరర్ మానసిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అతనిపై వేధింపులు తీవ్రంగా కొనసాగినట్లు స్నేహితులు తెలిపారు. ఈ వేధింపులు తట్టుకోలేకే సాయి తేజ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు ఆరోపించారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సాయి తేజ మృతికి బాధ్యులైన లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి మృతి, లెక్చరర్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఈ ఘటన సంచలనంగా మారింది.


