
ఫీజు రద్దు చేస్తారా.. ఉగ్రవాదులతో దాడి చేయించాలా?
పిల్లలకు స్కూలు ఫీజులు కట్టడం చాలా కష్టం అయిపోతోంది. ఆ భారం భరించలేక తల్లిదండ్రులు నానా బాధలు పడుతున్నారు. ఇలాగే స్కూలు ఫీజులు కట్టలేని ఓ తండ్రి.. ఏకంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులతో స్కూలు మీద దాడి చేయిస్తానని బెదిరించాడు. మర్యాదగా తన పిల్లలిద్దరి ఫీజులు మాఫీ చేయాలని, లేకపోతే ఉగ్రవాద దాడి తప్పదని, ప్రిన్సిపాల్‌ను నిలువునా తగలబెట్టేస్తానని కూడా బెదిరించాడు. బీసీఎం స్కూలు ప్రిన్సిపాల్ వెర్గెస్ జోసెఫ్‌కు ఇలా బెదిరింపు లేఖ రాసినందుకు ఉస్మాన్ అనే సదరు తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది.
ఉస్మాన్ తన పిల్లలకు ఫీజుగా రూ. 44వేలు చెల్లించాల్సి ఉంది. ఇంతకుముందు కూడా ఫీజు కట్టమని చెబితే, చంపుతానని బెదిరించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. అయితే ఉస్మాన్ ఇప్పుడు రాసిన లేఖ కూడా కేవలం బెదిరించడానికేనని, అంతే తప్ప అతడికి ఏరకంగానూ ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధం లేదని తెలుస్తోందని స్థానిక పోలీసు అధికారి తెలిపారు. స్కూల్లో ఉన్న పిల్లలు, టీచర్లందరి చేతిరాతను కూడా తాము సేకరిస్తున్నామని, కేసు దర్యాప్తులో ఇవి కూడా కీలకమని చెప్పారు. నేరపూరితంగా భయపెట్టినందుకు అతడిపై కేసు నమోదు చేశారు. అయితే, అసలు తాను అలాంటి లేఖ రాయలేదని, ఎవరో తన పేరును దుర్వినియోగం చేశారని ఉస్మాన్ అంటున్నాడు. తాను ఫీజు కట్టని మాట వాస్తవమేనని, ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందువల్లే కట్టలేదు తప్ప ప్రిన్సిపాల్‌తో తనకు గొడవలు ఏమీ లేవని అన్నాడు. త్వరలోనే ఫీజు కూడా కట్టేస్తానన్నాడు.