పాత నేరస్తుడు.. శరణార్థి.. | Paris was recognized the two Terrorists | Sakshi
Sakshi News home page

పాత నేరస్తుడు.. శరణార్థి..

Published Mon, Nov 16 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM

పాత నేరస్తుడు.. శరణార్థి..

పాత నేరస్తుడు.. శరణార్థి..

పారిస్ దాడుల్లో ఇద్దరు ముష్కరుల గుర్తింపు
 
♦ ఒక ఉగ్రవాది గ్రీస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు నిర్ధారణ
♦ మరొక ఉగ్రవాది ఫ్రాన్స్‌కే చెందిన చిన్న చిన్న నేరాలు చేసే పాత నేరస్తుడు
♦ బెల్జియంలో ముగ్గురు అనుమానితుల అరెస్ట్.. జర్మనీ లింకుపై దర్యాప్తు
♦ దాడిలో ఏడుగురు మానవబాంబులు పాల్గొన్నారు: ఫ్రాన్స్ అధికారి వెల్లడి
 
 పారిస్/ఏథెన్స్: ఉగ్రవాదుల నరమేధంతో నెత్తురోడిన పారిస్ నగరం.. ఆ పెను విషాదం నుంచి ఇంకా తేరుకోలేకపోతోంది. ఫ్రాన్స్ రాజధానిలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో బలయిన 129 మంది మృతులకు సంతాపంగా శనివారం రాత్రి విఖ్యాత ఈఫిల్ టవర్ చీకటిలో ఉండిపోయింది. దేశ వ్యాప్తంగా మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా అధ్యక్షుడు హోలాండ్ ప్రకటించారు. దేశ భద్రతను పూర్తిస్థాయి గరిష్టానికి పెంచారు. దేశవ్యాప్తంగా వేలాది మంది సైనికులను మోహరించారు. నగరంలోని పర్యాటక కేంద్రాలను ఆదివారం కూడా మూసే ఉంచారు. దాడుల్లో గాయపడ్డ 352 మందిలో 99 మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.

ఈ మారణహోమానికి కారకులైన వారిని వేటాడే పనిలో ఫ్రాన్స్ పోలీసులు, దర్యాప్తు సంస్థలు తలమునకలయ్యాయి. దేశంతో పాటు, అంతర్జాతీయంగానూ.. ముఖ్యంగా యూరప్ దేశాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. దాడులకు పాల్పడిన వారికి.. బెల్జియం, సిరియాల్లో లింకులను గుర్తించారు. బెల్జియం పోలీసులు ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. జర్మనీలో ఇటీవల కారులో పేలుడు పదార్థాలతో దొరికిన ఒక వ్యక్తికి పారిస్ దాడులతో సంబంధముందా అనే కోణంలో ఆ దేశ పోలీసులు పరిశోధిస్తున్నారు. దర్యాప్తు క్రమంలో ఒక ఉగ్రవాది గత నెల గ్రీస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకుని యూరప్‌కు వచ్చినట్లు కనుగొన్నారు. మరొక ఉగ్రవాది పారిస్‌కే చెందిన పాత నేరస్తుడిగా నిర్ధారించారు. అతడి కుటుంబసభ్యులను అధికారులు ప్రశ్నించారు.

 దాడిలో ఏడుగురు మానవబాంబర్లు. ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి పారిస్ నడిబొడ్డున పలు కఫేలు, రెస్టారెంట్లపై తుపాకులతో కాల్పులు జరపటం, జాతీయ స్టేడియం వద్ద ఆత్మాహుతి దాడులు చేయటం, కచేరీ జరుగుతున్న బాతాక్లాన్ థియేటర్‌లో తుపాకులు, గ్రెనేడ్లతో దాడి చేయటం ద్వారా 129 మందిని బలితీసుకోవడం తెలిసిందే. ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు సహా ఉగ్రవాదులు మూడు బృందాలుగా నరమేధం సృష్టించాయని పారిస్ ప్రాసిక్యూటర్ ఫ్రాంకోయి మొలిన్ తెలిపారు. ఉగ్రవాదులు ఒకే రకం జాకెట్లు ధరించారని.. వాటిలో టీఏటీపీ పేలుడు పదార్థాలు అమర్చుకున్నారన్నారు. బాతాక్లాన్‌లో 89 మందిని ఊచకోత కోసిన ఉగ్రవాదులు సిరియా, ఇరాక్‌ల గురించి ప్రస్తావించినట్లు చెప్పారు. దర్యాప్తులో దేశం వెలుపల లింకులను గుర్తించినటు తెలిపారు. మారణహోమం తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ప్రకటించగా.. ఇది ఫ్రాన్స్‌పై దాడేనని, ఈ నరమేధానికి దేశం వెలుపల కుట్ర పన్ని, స్థానికుల సాయంతో విదేశాల నుంచే నిర్వహించారని దేశాధ్యక్షుడు హోలాండ్ పేర్కొన్నారు.

 దాడులకు వాడిన కారులో ఏకే 47 తుపాకులు.. ఉగ్రవాదులు వాడిన ఒక కారును మాంట్రీయోలో గుర్తించారు. అందులో దాడుల్లో ఉపయోగించిన తరహా ఏకే47 తుపాకులు చాలా ఉన్నాయి. తూర్పు పారిస్‌లో ఒక రెస్టారెంట్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు నల్ల సీట్ లియాన్ కారులో వచ్చారని, ఏకే47 తుపాకులతో కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. మృతుల్లో వివిధ దేశాల యువత...వైట్ కాలర్ నేరాల కేసుల్లో నిపుణుడైన ఫ్రాన్స్  లాయర్ వాలెన్‌టిన్ రిబెట్(26), స్పెయిన్‌కు చెందిన ఇంజనీర్ గొంజాలెజ్ గారిడో(29), మ్యూజిక్ గ్రూప్ ప్రొడ్యూసర్ థామస్ అయాద్ (32), రాక్ బ్యాండ్‌కు వస్తువులు విక్రయిస్తున్న ఇంగ్లండ్‌కు చెందిన నిక్ అలెక్సాండర్(36).. వీరు పారిస్ నరమేధంలో అసువులు బాసిన వారిలో కొందరు.

 శరణార్థులతో పాటు.. ఈ ఏడాది ఆరంభం నుంచి యూరప్‌లోకి పెరుగుతున్న వలసలు.. ప్రత్యేకించి అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియా నుంచి భారీగా కొనసాగుతున్న వలసలను జిహాదీ ఉగ్రవాదులు అనుకూలంగా మలచుకునే ప్రమాదముందని ఈయూ భద్రతా అధికారులు చాలా కాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది 80 వేల మంది మధ్యధరాసముద్రం దాటి యూరప్‌కు శరణార్థులుగా వచ్చారు. మధ్య ప్రాచ్యంలో ఇస్లాం ఫాసిజం బాధితులతో పాటు అతివాద శక్తులు కూడా యూరప్‌లోకి ప్రవేశిస్తున్నాయన్న విషయం ఇప్పుడు స్పష్టమయిందని గ్రీస్ రక్షణమంత్రి పనోస్ కమెనోస్ అన్నారు.
 
 ఎనిమిదిసార్లు దోషి..!
 నరమేధానికి పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒకరిని 29 ఏళ్ల ఒమర్ ఇస్మాయిల్ మొస్తెఫాయ్‌గా అధికారులు గుర్తించారు. బాతాక్లాన్ థియేటర్‌లో మారణకాండ తర్వాత బాంబులు పేల్చుకుని ఆత్మాహుతి చేసుకున్న అతని శరీరం నుంచి తెగిపడిన చేతివేలి ముద్రలు.. పోలీసు పాత నేరస్తుల రికార్డుల్లోని మెస్తెఫాయ్ వేలిముద్రలతో సరిపోయాయని తెలిపారు. అతడు పారిస్‌లోని పేద ప్రాంతమైన కోర్‌కోరానెస్‌లో జన్మించాడని.. అతడికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారని చెప్పారు. గతంలో చిన్న చిన్న నేరాల్లో ఎనిమిదిసార్లు దోషిగా నిర్ధారితుడయ్యాడని.. అయితే ఎప్పుడూ జైలు శిక్షకు గురికాలేదని వివరించారు.
 
 అనుమానితుడిఆచూకీ చెప్పండి...
 పారిస్ దాడులకు సంబంధించి అనుమానిత ఉగ్రవాది ఫొటో, వివరాలను ఫ్రాన్స్ పోలీసులు ఆదివారం విడుదల చేశారు. సలాహ్ అబ్దేస్లాం అనే 26 ఏళ్ల వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. అతడిపై బ్రెజిల్ ప్రభుత్వం అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
 
 ఆశ్రయంకోసం వచ్చి...!
 పారిస్ దాడుల్లో పాల్గొన్న ఒక ఉగ్రవాది కొంత కాలం కిందట గ్రీస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకున్నట్లు ఆ దేశ పోలీసులు తెలిపారు. సిరియా శరణార్థులు యూరప్‌లో ప్రవేశించటానికి ప్రధాన ద్వారంగా ఉన్న గ్రీస్‌లో శరణార్థులుగా పేర్లు నమోదు చేసుకుని ఉగ్రవాదులు ప్రవేశించారన్న సందేహంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈ విషయం నిర్ధారణ అయింది. పారిస్‌లోని బాతాక్లాన్ థియేటర్ వద్ద దాడులకు పాల్పడి చనిపోయిన ఒక వ్యక్తి వద్ద సిరియా పాస్‌పోర్ట్ దొరకడంతో.. అతడి వేలిముద్రలను, మరోఉగ్రవాది వేలిముద్రలను పరీక్షించాలని గ్రీస్‌ను ఫ్రాన్స్ కోరింది. పాస్‌పోర్ట్ కలిగివున్న వ్యక్తి అక్టోబర్ 3న గ్రీస్ దీవి లెరోస్‌లో శరణార్థిగా పేరు నమోదు చేసుకుని యూరోపియన్ యూనియన్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించామని ఆ దేశ పౌర రక్షణ మంత్రి నికోస్ తాస్కాస్ తెలిపారు. దీంతో పారిస్ దాడుల్లో సిరియా ఉగ్రవాదుల పాత్ర ఉందన్నది తేలుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
 
 ఆత్మాహుతి జాకెట్లు పారిస్‌లోనే తయారు చేశారు!
 పారిస్‌లో దాడులకు ఉగ్రవాదులు ఉపయోగించిన ఆత్మాహుతి జాకెట్లు.. చాలా నైపుణ్యం గల వ్యక్తి రూపొందించినవని.. ఆ వ్యక్తి ఇంకా యూరప్‌లో సంచరిస్తూ ఉండే అవకాశముందని నిఘా, భద్రతా నిపుణులు చెప్తున్నారు. ‘ఉగ్రవాదులు ఏడుగురూ ఒకే తరహా బాంబు జాకెట్లు ధరించారు’ అని వారు వివరిస్తున్నారు. ‘లండన్ నగరంలో 2005లో జరిగిన ఉగ్రదాడుల్లో దాడిచేసిన వారు పేలుడు పదార్థాలను వీపుకు ధరించిన బ్యాగుల్లో పెట్టుకున్నారు. కానీ.. పారిస్‌లో దాడి చేసిన ఉగ్రవాదులు వినియోగించిన జాకెట్లు మధ్య ప్రాచ్య ప్రాంతాల్లో బాంబు దాడులకు ఉగ్రవాదులు వినియోగించే జాకెట్ల లాగానే ఉన్నాయి.

ఆత్మాహుతి జాకెట్లు తయారు చేయటానికి బాంబుల తయారీ నిపుణుడు అవసరం. అది చాలా క్లిష్టమైన పని’ అని ఫ్రాన్స్ నిఘా సంస్థ మాజీ అధిపతి విలేకర్లతో పేర్కొన్నారు. ‘బాంబులు అమర్చిన బెల్టు కానీ, జాకెట్ కానీ.. అది తొడుక్కున్న వ్యక్తి ఇబ్బంది లేకుండా సంచరించేలా చూడటం.. ప్రమాదవశాత్తూ పేలిపోకుండా చూడటం.. బాంబుల విషయంలో ఎంతో నైపుణ్యం గల వారు మాత్రమే చేయగలరు. పారిస్ నగరంలో ఉగ్రవాదులు వాడిన ఆత్మాహుతి జాకెట్లు టీఏటీపీతో చేసినట్లుగా ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ జాకెట్లలో ఒక బ్యాటరీని, ఒక పేల్చే స్విచ్ (డిటొనేషన్ బటన్)ను, పేలుడులో గాయాలను పెంచటానికి పదునైన వస్తువులను వినియోగించారు. వారు ఈ జాకెట్లను సిరియా నుంచి తీసుకురాలేదు’ అని వివరించారు. ‘బాంబులు తయారు చేసిన వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు ఇక్కడే ఫ్రాన్స్‌లో, యూరప్ ఖండంలో ఉండే అవకాశం చాలా ఉంది. వారు జిహాదీ ప్రాంతాలకు వెళ్లి వీటిని తయారు చేయటం నేర్చుకుని తిరిగి వచ్చి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement