'ఓడిపోలేదు.. గుణపాఠం నేర్చుకుంటాం'
బ్రస్సెల్స్: ఉగ్రవాదుల దాడిని ముందుగానే పసిగట్టి తిప్పిగొట్టడంలో విఫలమయ్యారని వస్తున్న ఆరోపణలను బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖెల్ తిప్పికొట్టారు. ఈ దాడి తర్వాత తాము ఏ కోశాన భయపడలేదని, అంతే వేగంగా స్పందించామని అన్నారు. 'ఒక నిజం మాట్లాడే విషయంలో ఎప్పటికీ భయపడవద్దు. మేం ఏది సరిగా చేశాం.. ఏది తప్పుగా చేశాం, ఎక్కడ వైఫల్యం చెందాం అనే అంశాలను తెలుసుకోవాల్సి ఉంది.
అవి తెలుసుకుని వాటి ద్వారా భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకుంటాం. బెల్జియం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో విఫలమైందని అనే మాటలను అంగీకరించను. ఎందుకంటే వారిపై సమర్థంగా పోరాడిన దేశం మాది. కానీ, ఇప్పుడొక వైఫల్యం కనిపించింది. అది ఎలాంటిదంటే అమెరికా 9/11 దాడుల్లాంటిది, లండన్ గతంలో ఎదుర్కొన్న సమస్య లాంటిది. మేం కూడా ఈ ఘటనతో గుణపాఠం నేర్చుకుంటాం' అని ఆయన చెప్పారు. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసి 32మందికి పైగా ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే.