అమెరికా అగ్రవాదమే ఈ ఉగ్రవాదం! | ABK Prasad Guest Column On Global Terrorism | Sakshi
Sakshi News home page

అమెరికా అగ్రవాదమే ఈ ఉగ్రవాదం!

Published Tue, Oct 29 2019 12:50 AM | Last Updated on Tue, Oct 29 2019 12:51 AM

ABK Prasad Guest Column On Global Terrorism - Sakshi

‘‘అబద్ధాల మీద ఆధారపడి యుద్ధాల ద్వారా అమెరికా లక్షలాది ప్రజల్ని చంపేసిన మాట నిజమే. ఇందుకు గాను అమెరికా 8 ట్రిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 566 లక్షల కోట్లు) ఖర్చు చేయవలసి వచ్చింది.’’
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌
ఒప్పుకోలు : అమెరికా ‘ఇన్ఫర్మేషన్‌ క్లియరింగ్‌ హౌస్‌’’ (ఐసీహెచ్‌) సమాచారం: బిల్‌ వాన్‌ ఆకెన్‌; 10–10–2019
‘సిరియాలో తిష్ట వేసిన ఇస్లామిక్‌ స్టేట్‌ అగ్రనాయకుడు అబూ బక్రాలా బాగ్దాదీ అమెరికా సైన్యం జరిపిన దాడిలో కుక్కచావు చచ్చాడు, పిరికివాడిలా చచ్చాడు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అతడు బాగ్దాదీ అని చెబుతున్నారు’ (అసోసియేటెడ్‌ ప్రెస్‌). కానీ హతమైంది బాగ్దాదీ యేనని ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఒక మూవీ చూస్తున్నట్లు ఓ ప్రకటనలో ధృవీకరించాడు. కానీ బాగ్దాదీని వేటాడటానికి సైనికులు సహాయం తీసుకుంది డాగ్‌ స్క్వాడ్‌కి చెందిన ఒక కుక్కనే అన్న సంగతి ట్రంప్‌ మరిచిపోయాడు. కారణం.. పాశవిక హింసాప్రియుడు ట్రంప్‌. ‘‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’’ అన్నట్లు 26వ తేదీన చంపామని ట్రంప్‌  ఉద హరించిన బాగ్దాదీ ఎవరో కాదు. మీరు పెంచి పోషించిన వ్యక్తే సుమా అని కామన్‌ డ్రీమ్స్‌ సంస్థ తరపున సీఎన్‌బీసీ రిపోర్టర్‌ జాన్‌ హార్యుడ్‌ ప్రకటించారు (27–10–2019). ఇరాన్‌ నాయకులు కూడా అలానే ప్రకటించారు.

ఈ గాథలు, ప్రపంచ ఘటనలు, అమెరికా నాయకస్థానంలో ఉన్న వలస సామ్రాజ్య వాద పాలకుల చేష్టలు, ప్రకటనలు గమనిస్తూంటే, ప్రపంచ ఉగ్రవాద ప్రమాదం గురించిన వీరి అంచనాలు ఒకరకంగా ఉంటూ, ఉగ్రవాద నిర్మూలన పేరిట నేడు జరుగుతున్నది అమెరికా అగ్రవాదమే అనిపిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, కొన్నేళ్ల క్రితం బిన్‌ లాడెన్‌ పేరిట ప్రపంచవ్యాప్తంగా అమెరికా–బ్రిటన్‌లు జరి పిన వేటకు, ఆ ముసుగులో అప్ఘానిస్తాన్, ఇరాక్, ఇరాన్‌ల మీద జరి పిన పాశవిక దాడులకు ఇటీవల సిరియాలో జోక్యం దారీ వేటకు ఎత్తుగడలు, వ్యూహాలన్నీ రిపబ్లికన్, డెమోక్రాటిక్‌ పార్టీల నాయకుల కనుసన్నలలోనే జరుగుతున్నాయని పైన తెల్పిన ట్రంప్‌ ప్రకటనే (అబద్ధాలపై ఆధారపడి యుద్ధాలను అమెరికా నిర్వహిస్తోందని) చెప్పక చెబుతోంది! బాగ్దాదీని అంతం చేశామని ప్రకటించిన ట్రంప్‌ తీరు చూస్తే సామ్రాజ్యవాద పాలకులే కాదు.. కొన్ని దేశాల పాలకులు కూడా ఎన్నికలలో విజయావకాశాలను పెంచుకునేందుకు కూడా ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి ఇరుగు పొరుగు మీదకో లేదా తమకు పడని దేశాల మీదకో యుద్ధకాహళులూది, ఉద్రిక్తతలు పెంచ డానికి వెనుదీయరని గత చరిత్రే కాదు, నడుస్తున్న చరిత్రకూడా దాఖ లాలుగా ఉన్నాయి. 

ట్రంప్‌ ఇంత సీరియస్‌గా బాగ్దాదీ చావు గురించి అంత హడా వుడిగా చేసిన ప్రకటన ఆధారాల్ని పాశ్చాత్య పరిశీలకులు, కొన్ని పత్రికలు ప్రశ్నిస్తున్నాయి. అవి: 1. కొన్ని నెలల్లో రానున్న అధ్యక్ష ఎన్నికల పూర్వ రంగంలో ఇటీవల ట్రంప్‌ రష్యా, చైనాల పైన పొంతన లేని ఆరోపణలు చేస్తుండటం, తద్వారా అమెరికా ప్రతిష్టను దిగజార్చడానికి నిరసనగా అమెరికా పార్లమెంటులో ట్రంప్‌కు వ్యతి రేకంగా అభిశంసన తీర్మానం రాబోవడం. 2. సిరియాలో అమెరికా, కుర్దిష్‌ అనుయాయులపై టర్కీ జరిపే దాడులకు దూరంగా ఉండటం కోసం సిరియా నుంచి అమెరికా సేనలను ఉపసంహరించుకోవాలని ట్రంప్‌ అకస్మాత్తుగా ప్రకటించడాన్ని రిపబ్లికన్, డెమోక్రాటిక్‌ పక్షాలు రెండూ విమర్శించడం. ఇందుకు అనుగుణంగా టర్కీ, కుర్దూల మధ్య యుద్ధవిరమణను ప్రకటిస్తున్నట్లు ట్రంప్‌ వెల్లడించ డమూ! ఇది ఇలా ఉండగా, బాగ్దాదీని ఖతం చేసినట్లు స్వయానా ట్రంప్‌ అకస్మా త్తుగా చేసిన ప్రకటనను స్వయానా అమెరికన్‌ సైనిక యుద్ధ తంత్ర కార్యాలయం (పెంటగన్‌) సైతం ధృవీకరించడానికి నిరాకరించింది.

చివరకు ‘ఆసులో గొట్టాం’ మాదిరిగా చీమ చిటుక్కుమంటే చాలు విసుగూ విడుపూ లేకుండా ప్రచారం కోసం ప్రకటనలు విడుదల చేస్తూండే ట్రంప్‌ అధ్యక్ష ప్రాసాద సాధికార ప్రతినిధి హాగన్‌ గిడ్లీ సహితం నోరు మెదపకుండా అదంతా ట్రంపే చూసుకుంటాడు లెమ్మని ముక్తసరిగా చెప్పాడు. పైగా బాగ్దాదీని అంతమొందించడా నికి జరిగిన దాడి ప్రయత్నం ‘జయ ప్రదమయిందా’ అన్న ప్రశ్నకు దాడిని నిర్వహించానని చెప్పిన అధికారి కూడా వివరాలు తెల్పడానికి నిరాకరించాడు. ఇక సుప్రసిద్ధ ప్రపంచ వార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ సంప్రదించిన అమెరికన్‌ అధికారులు కూడా నిజానిజాల గురించి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇన్ని వైరుధ్యాల మధ్య బాగ్దాదీ ‘హతం, ఖతం’ వార్తలు విడుదలయ్యాయి. అందుకే, గతంలో ‘9/11’ (2001–2002) నాటి అమెరికా జంట వాణిజ్య కేంద్ర భవన సముదాయంపై జరిగిన ఆకస్మిక దుర్మార్గపు దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ దాడికి వ్యూహకర్త, ఇస్లామిక్‌ ఉగ్ర వాద నాయకుడు బిన్‌లాడెన్‌ స్వయంగా దాడికి కారకుడని ప్రచార ప్రకటన జార్జిబుష్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న కాలంలో జరిగింది. కానీ, ఆ తర్వాత 1,500 మంది అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రసిద్ధ భవన నిర్మాణ ఇంజనీర్లు, స్ట్రక్చరల్‌ ఇంజనీర్లు, పలువురు శాస్త్రవేత్తలు, భౌగోళికంగా భవన పునాదుల నిర్మాణ సంబంధమైన వాస్తు శిల్పులు, సామాజిక శాస్త్ర వేత్తలతో ఏర్పడిన కమిటీ భేటీ జరిపి సమర్పించిన నివేదికలో న్యూయార్క్, వాషింగ్టన్‌ వ్యూహ కేంద్రాలపై దాడి చేసిన సివిలియన్‌ విమానాలు ఎక్కడివో కావు, అమెరికావేననీ, ఫ్లారిడా (అమెరికా)లోని సైనిక కేంద్రం నుంచి బయలు దేరినవేనని ప్రకటించారు.. అంతవరకూ అమెరికా ప్రజలు, ప్రపంచ ప్రజలూ అది ఉగ్రవాద మూకల దాడేనని నమ్మాల్సి వచ్చింది, విశ్వసించాల్సి వచ్చింది.

ఆ విశిష్ట నిపుణుల సంఘం ఇప్పటికీ దాడి అనంతర వాస్తవాలను తవ్వి తీయడం మానలేదు సుమా! పైగా, ట్విన్‌ టవర్లపై దాడి, బిన్‌ లాడెన్‌పై దాడి, అతగాడి మృతి గురించి కూడా పరస్పర విరుద్ధ కథనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. 2001 సెప్టెంబర్‌ 11న జంట వాణిజ్య సముదాయాలపై ఉగ్రవాద దురాగతం జరిగిందనీ, ఈ దాడిని నిర్వహించినవాడు బిన్‌లాడెన్‌ అనీ మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ, ఆ లాడెన్‌ 2001 అక్టోబర్‌ 10న రావ ల్పిండి ఆసుపత్రిలో ఉన్నాడని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అమెరికాలోని జంట వాణిజ్య సముదాయ భవనాలు కూలిపోయింది 2001 సెప్టెంబర్‌ 11న అనీ, 2001 సంవత్సరం మధ్యలో లాడెన్‌ దుబాయ్‌లోని అమెరికన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడనీ సీబీఎస్‌ న్యూస్‌ యాంకర్‌ డాన్‌ రాదర్‌ రాశాడు.

ఇక ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అయితే, లాడెన్‌ మృతిని 2001 డిసెంబర్‌గా పేర్కొన్నది. అతణ్ణి ఖననం చేసింది అప్ఘానిస్తాన్‌ అని చెప్పింది. ఇక అమెరికా అయితే లాడెన్‌ను పట్టుకుని ఖతం చేసింది అబ్బాటోబాద్‌లో అని రాసింది. ఇన్ని వైరుధ్యాల మధ్య లాడెన్‌ వాస్తవాలు దోబూచులా డుతూ వచ్చాయి. అసలింతగా లాడెన్‌ వెనుక దాగివున్న అసలు రహస్యమేమిటి? అది అమెరికాకే తెలుసు. ఎందుకంటే ఆప్ఘనిస్తాన్‌లో ఏలుబడిలో ఉన్న సోషలిస్టు అనుకూల ‘ప్రజాస్వామ్య’ ప్రభుత్వాన్ని ఈ లాడెన్, అతని అనుయాయుల సహకారంతోనే ఆయుధాలిచ్చి అమెరికా కూలదోసింది. ఆ తర్వాత లాడెన్‌ తనకు ‘ఏకు మేకై’ పోయాడు కాబట్టి, అతణ్ణి హత మార్చాలి. లాడెన్‌ను ఖతం చేసిన అమెరికా అతని అస్థిపంజరం ఆధారంగా వరస వారీగా ఇరాక్, ఇరాన్, సిరియాలపై యథేచ్చగా దాడులు చేసి, ఆ దేశాల వాస్తు శిల్ప సంపదను దోచేసి అమెరికాకు తరలించుకుపోవడం మరపురాని సామ్రాజ్యవాద యుద్ధ సత్యాలు.

 కనుకనే, సామాజిక చేతనాజీవులైన అసాంజే (వికీలీక్స్‌), అమె రికా యుద్ధతంత్ర వ్యవస్థలో జాతీయ భద్రతా దళ శాఖలో పనిచేసి కళ్లారా చూసిన ఘోరాలకు చలించిపోయి కాందిశీకుడై ప్రపంచ ప్రజ లకు అమెరికా యుద్ధోన్మాద వ్యవస్థ స్వరూప స్వభావాలను ప్రాణా లకు తెగించి ఈరోజుదాకా ఎండగడుతూ వచ్చిన ఎడ్వర్డ్‌ స్నోడెన్‌ మరపురాని త్యాగశీలురుగా సజీవులై బాధలను భరిస్తూ మనకళ్ల ముందే అమెరికాకు చిక్కకుండా నిత్య సింహస్వప్నాలై వెలుగొందు తున్నారని మరవరాదు. 9/11 జంట వాణిజ్య సముదాయాల ఘోర కలికి అమెరికా పాలకులు ఎలా కారకులో నిరూపిస్తూ ప్రపంచ ప్రజలు ఎన్నటికీ మరవకూడని ‘శాశ్వత రికార్డు’ (పర్మనెంట్‌ రికార్డ్‌) పేరిట ఇటీవలనే (2019) ఒక ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు స్నోడెన్‌. ‘‘9/11 ఘోరకలి ఘటనలు ప్రతిచోట అగాథాలు సృష్టించాయి.

కుటుంబాలలో ఛిద్రాలు, వివిధ వర్గాల ప్రజలు, సామాజికుల మధ్య విచ్ఛిన్నాలు, కమ్యూనికేషన్స్‌ విచ్ఛిత్తీ, ఉపరితలంపైనే కాదు, భూగ ర్భంలోనూ విచ్ఛిన్న శకలాలే’’నని రాశాడు. ఈ స్వవినాశన చర్యకు ఫలితంగా అమెరికా చెప్పిన సమాధానం– పదిలక్షలమంది ప్రజల హత్యాకాండ అని రాశాడు (పేజి 77–78). అలాగే, 9/11 దుర్మార్గ ఘటన గురించి అమెరికా ప్రభుత్వం ‘సాధికారిక నివేదిక’ పేరిట (మిస్టీరియస్‌ కొలాప్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌–7, ది ఫైనల్‌ రిపోర్ట్, ఎబౌట్‌ 9/11) వెలువరించిన కవిలకట్ట కాస్తా ‘శుద్ధ అబద్ధపు అశా స్త్రీయ దస్తరం’ అని డేవిడ్‌ రే అనే పరిశోధకుడు వెల్లడించారు. ఈ ‘నివేదిక’ మనకాలపు పచ్చి అబద్ధాల పుట్టే కాదు, ప్రపంచంలో ఎవరి మీద కాలు దువ్వని అనేక శాంతి కాముక దేశాలపై ఏదో ఒక మిష పైన అమెరికన్‌ దురాక్రమణ యుద్ధాలు నిర్వహించడానికి ఈ తప్పుడు నివేదిక ద్వారాలు తెరిచిందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement