FIFA World Cup 2022: Belgium vs Morocco match triggers riots in Brussels - Sakshi
Sakshi News home page

FIFA WC 2022: మొరాకో చేతిలో పరాభవం.. బెల్జియంలో చెలరేగిన అల్లర్లు

Published Mon, Nov 28 2022 10:00 AM | Last Updated on Mon, Nov 28 2022 1:56 PM

Belgium Morocco World Cup Match Triggers Riots in Brussels - Sakshi

ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో జట్టు బెల్జియంపై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతర్‌లో అల్‌ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అయిన బెల్జియంను మొరాకో మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్‌-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. 

బ్రెజిల్‌ పరాజయాన్ని జీర్జించుకోలేని పలువురు ఫుట్‌బాల్‌ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. కొందరు కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరిని అరెస్ట్‌ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

బెల్జియం రాజధాని అంతటా అనేక చోట్ల ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బెల్జియం పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్‌ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్‌ మెటీరియల్‌, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. బాణా సంచా పేల్చడంతో ఓ జర్నలిస్టు ముఖానికి గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల తాము జోక్యం చేసుకొని జల ఫిరంగులను, టియర్‌ గ్యాస్‌ ఉపయోగించినట్లు తెలిపారు. 
చదవండి: Ju Ae: కిమ్‌ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement