ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా భారతకాలమానం ప్రకారం ఇవాళ (నవంబర్ 27) సాయంత్రం 6:30 గంటలకు అల్ తుమామ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఎఫ్ మ్యాచ్‌లో ప్రపంచ 2వ ర్యాంకర్ బెల్జియం, 22వ ర్యాంకర్ మొరాకో జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన మొరాకో.. తమ కంటే మెరుగైన బెల్జియంను 2-0 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది.
రెండో అర్ధభాగం 75వ నిమిషంలో లభించిన ఫ్రీ కిక్‌ను అబ్దెల్ హమీద్ సాబిరి అద్భుతమైన గోల్‌గా మలిచి మొరాకోను ఆధిక్యంలో తీసుకెళ్లాడు. అనంతరం 90వ నిమిషంలో జకారియా అబౌక్లాల్ రెండో గోల్ చేసి మొరాకోకు చారిత్రక విజయాన్ని అందించాడు. 1998 తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌లో మొరాకో మ్యాచ్ గెలవడం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో గ్రూప్-ఎఫ్‌లో మొరాకో.. బెల్జియంను వెనక్కునెట్టి అగ్రస్థానానికి చేరుకుంది.
కాగా, నవంబర్ 23న క్రొయేషియాతో జరిగినను మ్యాచ్‌ను మొరాకో 0-0తో డ్రా చేసుకోగా.. 24న కెనడాపై బెల్జియం 1-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉంటే, ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు అహ్మద్ అలీ బిన్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఈ మ్యాచ్‌లో ప్రపంచ 31 ర్యాంకర్ కోస్టారికా.. తమ కంటే పటిష్టమైన 24వ ర్యాంకర్ జపాన్‌కు షాకిచ్చింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కోస్టారికా.. జపాన్‌ను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. రెండో అర్ధభాగం 81వ నిమిషంలో కీషర్ ఫుల్లర్ గోల్ కొట్టి కోస్టారికాను గెలిపించాడు.
Comments
Please login to add a commentAdd a comment