ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇటీవలే బాంబులతో మారణహోమం సృష్టించిన ఐసిస్ టెర్రరిస్టులు ప్రజలను ఆకర్షించేందుకు మరో కొత్త అవతారం ఎత్తారు. తమలో కరుడుగట్టిన కాఠిన్యంతోపాటు క్రీడాస్ఫూర్తి కూడా ఉందని నిరూపించుకునేందుకు మినీ జిహాదీ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. జిహాదీల మధ్య ‘టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చెయిర్స్’ లాంటి ఆటల పోటీలను నిర్వహించారు.
ఇరాక్‌లోని తమ ఆధీనంలోని తల్ అఫర్ పట్టణంలో ఇటీవల నిర్వహించిన ఆటల పోటీలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పిల్లలకు గాలి బుడగలు ఊదడం లాంటి పోటీలు కూడా నిర్వహించారు. విజేతలందరికి పోటీల తర్వత స్వీటు ప్యాకెట్లను పంచిపెట్టారు. ఈ పోటీల్లో ఐదేళ్ల బాలలు కూడా పాల్గొనడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొనాలంటూ స్థానిక ప్రజలను ప్రోత్సహించారు. స్థానికుల్లో పిల్లలు తప్ప పెద్దలెవరూ హాజరు కాకపోయినా, వారంతా వచ్చి జీహాదిల మధ్య జరిగిన పోటీలను ప్రోత్సహించారు.
జీహాదీలు బ్రిటిష్ ఫుట్‌బాల్ ఆటగాళ్ల షర్టులను ధరించి మరీ పోటీల్లో పాల్గొన్నారు. ఇరాక్, సిరియా దేశాల్లో తమ ఆధీనంలోని నగరాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చాటుకునేందుకే ఈ ఆటల పోటీలను నిర్వహించారని స్థానిక ప్రజలు వ్యాఖ్యానించారు. ఐసిస్ టెర్రరిస్టుల ట్విట్టర్ వినియోగం గత రెండేళ్లలో 45 శాతం తగ్గిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించిన నేపథ్యంలోనే జీహాదీ ఒలింపిక్స్ పోటీలకు సంబంధించిన ఫొటోలు ట్విట్టర్‌లో పోస్ట్ అయ్యాయి.
జిహాదీల మధ్య ఆటల పోటీలు
Published Mon, Jul 11 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM
Advertisement