
సెక్స్ బానిసలుగా లొంగనందుకు..
క్రూరత్వానికి, అరాచకత్వానికి మారుపేరుగా మారిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ జరిపిన మరో అరాచకం ఇది.
లండన్: క్రూరత్వానికి, అరాచకత్వానికి మారుపేరుగా మారిన ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ జరిపిన మరో అరాచకం ఇది. తమ ఆదేశాలకు తలొగ్గి సెక్స్ బానిసలుగా కొనసాగేందుకు నిరాకరించిన 250 మంది బాలికలను అతికిరాతకంగా తలనరికి చంపింది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్. తమ అధీనంలో ఉన్న ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. తమ గ్రూపు తరఫున పనిచేస్తున్న ఉగ్రవాదులను తాత్కాలికంగా పెళ్లిడి.. వాళ్లకు సెక్స్ బానిసలుగా సేవలందించాలని ఐఎస్‌ఐఎస్ ఫర్మానా జారీచేసింది.
ఈ ఆదేశాలను ధిక్కరించిన అమ్మాయిల తల నరికి చంపుతామని బెదిరించింది. అయినా దాదాపు 250 మంది బాలికలు ఈ కిరాతకమైన, అనాగరికమైన ఆదేశాలను ఒప్పుకోలేదు. దీంతో వారిని కుటుంబసభ్యుల సమక్షంలోనే తల నరికి చంపినట్టు కుర్దిష్ డెమొక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి సయెద్ మముజిని తెలిపారు. ఈ సెక్సువల్ జిహాద్ కోసం తమ బిడ్డలను అప్పగించేందుకు నిరాకరించిన తల్లిదండ్రులను కూడా ఐఎస్ ఉగ్రవాదులు ఇదేరకంగా హతమార్చారని ఆయన వెల్లడించారు.
ఐఎస్ అధీనంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ మానవహక్కులు ఏమాత్రం అమలు కావడం లేదని, మరీ ముఖ్యంగా మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆయన తెలిపారు. అమ్మాయిలు తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొనేందుకు ఏమాత్రం అనుమతి లేదని ఆయన చెప్పారు. గత ఏడాది ఆగస్టులో మోసుల్ పట్టణంలో ఐఎస్ ఫైటర్లతో శృంగారంలో పాల్గొనేందుకు నిరాకరించినందుకు 19 మందిని అతి కిరాతకంగా చంపేశారని, అదే తరహాలో ఈ హత్యల పరంపర కొనసాగుతూనే ఉందని పేట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్థాన్ పార్టీ ప్రతినిధి ఘాయస్ సుర్చి తెలిపారు.