
ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య
అఫ్గాన్‌లో ఐసిస్ దారుణం
కాబూల్: ఇస్లామిట్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌లో మరో దారుణానికి ఒడిగట్టారు. స్థానికుల సాయంతో తమ కమాండర్‌ను ప్రభుత్వ బలగాలు చంపాయనే ఆగ్రహంతో సుమారు 30 మంది అమాయక పౌరులను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించి దారుణంగా హత్య చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం సెంట్రల్ అఫ్గాన్‌లోని గోర్ ప్రావిన్స్‌లో జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
గోర్ గవర్నర్ నాసిర్ మాట్లాడుతూ.. మంగళవారం స్థానికుల సాయంతో భద్రతా బలగాలు ఐసిస్ కమాండర్‌ను హతమార్చాయని చెప్పారు. దీనికి ప్రతీకారంగా ఆ వెనువెంటనే సుమారు 30 మంది గ్రామస్తులను ఐసిస్ అపహరించిందన్నారు. వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం వారి మృతదేహాలను స్థానికులు సమీపంలో గుర్తించినట్లు చెప్పారు.