
అంతా యాప్స్‌తోనే..
అధునాత పరిజ్ఞానం ఉగ్రమూకలకు కలిసివస్తోంది. ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన పలు మొబైల్ అప్లికేషన్స్‌ను రహస్య సమాచారం మార్పిడికి ముష్కర మూకల నుంచి నేరగాళ్ల వరకు తెలివిగా వినియోగించుకుంటున్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) అనుబంధ సంస్థ ‘అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్’ (ఏయూటీ) ముష్కరులు సైతం సమాచార మార్పిడికి వాట్సప్, ట్రిలియన్ తదితర యాప్స్‌ను వినియోగించారని వెల్లడైంది. వీరంతా వీటివైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం.. వాటిలో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ విధానమే.
- సాక్షి, సిటీబ్యూరో
♦ సమాచార మార్పిడికి ముష్కర మూకల వినియోగం
♦ కలిసి వస్తున్న ‘ఎండ్ టు ఎండ్’ ఎన్‌క్రిప్షన్ విధానం
♦ మ్యాన్ ఇన్ మిడిల్ ఎటాక్స్ తప్పించుకోవడానికే..
♦ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న ఎన్టీఆర్వో..
చిత్తు చేస్తున్న NTRO
ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న చిక్కిన జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ మాడ్యుల్, తాజాగా బుధవారం పట్టుబడిన ‘ఏయూటీ’ హైదరాబాద్ మాడ్యుల్స్ యాప్స్‌ను వినియోగించాయి. సిరియా/ఇరాక్‌లో ఉన్న తమ హ్యాండ్లర్స్‌తో పాటు ముఠా సభ్యులతో సమాచారం మార్చుకోవడానికి వీటినే ఆశ్రయించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న ముష్కర మూకలన్నీ ఈ పంథానే అనుసరిస్తుండడంతో వీరి ఎత్తులను నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) చిత్తు చేస్తోంది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఈ సంస్థ నిఘా వర్గాలకు వెన్నుముక లాంటిది. ఈ సంస్థ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తున్న ముష్కర మూకలపై కన్నేసింది. ఎన్‌క్రిప్టెడ్ సందేశాలతో పాటు మరింత క్లిష్టమైన విధానంలో ఉన్న వాటిని సైతం డీక్రిప్ట్ చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం దీనికుంది. ఆన్‌లైన్ కేంద్రంగా విస్తరిస్తున్న ఐసిస్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేకంగా ‘ఆపరేషన్ చక్రవ్యూహ్’ పేరుతో ప్రత్యేక విధానం అవలంభిస్తోంది.
ఏమిటీ ‘క్రిప్షన్స్’..
యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించిన పరిజ్ఞానమే ‘ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్’. ఇటీవల వాట ్సప్ వినియోగదారులకు ‘ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్’ అంటూ అప్‌డేట్ వచ్చింది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్‌కు వెళ్లే దాకా అది ఎన్‌క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్ చేస్తే అది ఎన్‌క్రిప్ట్ అయ్యేసరికి ‘కీ’లుగా మారిపోతుంది.
ఉదాహరణకు ’బాంబ్’ అనే పదాన్నే తీసుకుందాం. ‘ఎండీ 5’ అనే ఆన్‌లైన్ ఎన్‌క్రిప్టర్ వెబ్‌సైట్‌లో ఈ పదాన్ని టైప్ చేస్తే (e373a9be7afbfa19aa17eaa54f19af88) అనే కీగా మారిపోయింది. దీంతో ఇది ఎన్‌క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశాన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్‌లోకి వచ్చిన తర్వాత డీక్రిప్షన్ ప్రక్రియ పూర్తయి మళ్లీ ‘బాంబ్’ అనే పదంగా మారుతుంది.
‘ప్రయాణమంతా’ ఎన్‌క్రిప్షన్‌లోనే..
ఏదైనా యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే అందులో ఎన్‌క్రిప్షన్‌తో పాటు డీక్రిప్షన్ సాఫ్ట్‌వేర్ సైతం అంతర్భాగంగా ఉంటుంది. సెండర్ నుంచి సర్వీసు ప్రొవైడర్ ద్వారా సాంకేతిక రూపంలో రిసీవర్ వరకు జరిగే ప్రయాణం మొత్తం ఆ సందేశం ఎన్‌క్రిప్షన్ విధానంలోనే జరుగుతుంది. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న సందేశాన్ని డీక్రిప్షన్‌లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ కీల్లోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ కీతో కూడిన ఎన్‌క్రిప్టెడ్ సందేశాన్ని ‘మధ్య’లో ఎవరైనా సంగ్రహించే ఆస్కారం ఉన్నా.. ప్రైవేట్ కీతో ఉండే సందేశాన్ని డీక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’ అన్నీ యాప్‌ను బట్టి, అందులో ఓ పదం మారే ఆల్గరిథెమ్‌ను బట్టి మారిపోతుంది. ఒక యాప్/సెండర్‌కు సంబంధించిన ఆల్గరిథెమ్ మరో యాప్/రిసీవర్ల ఆల్గరిథెమ్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకేలా ఉండవు.
‘ఎంఐఎం’ ఎటాక్స్‌కు చిక్కకుండా..
ఏదైనా ఓ సందేశం, సంభాషణ సెండర్‌కు రిసీవర్‌కు మధ్య జరుగుతుంది. ఇలాంటి వాటిలో అనుమానిత నెంబర్లు గుర్తించే నిఘా వర్గాలు ఆ సందేశాలను మధ్యలో సంగ్రహిస్తూ అధ్యయనం చేస్తుంటాయి. ఈ విధానాన్ని ‘మ్యాన్ ఇన్ మిడిల్’ (ఎంఐఎం) అటాక్‌గా పిలుస్తారు. సాధారణంగా కేంద్ర నిఘా వర్గాలు ఈ ఎంఐఎం ద్వారానే అనుమానిత, అవసరమైన నెంబర్లపై కన్నేసి ఉంచుతాయి. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఉండే యాప్‌ల ద్వారా జరిగే సమాచార మార్పిడి ఎంఐఎం ద్వారా నిఘా వర్గాలు సంగ్రహించినా.. కేవలం కీ మాత్రమే తెలుసుకోగలరు. సదరు యాప్‌కు సంబంధించిన ప్రైవేట్ కీ అందుబాటులో ఉంటేనే ఆ కీలను వర్డ్స్‌గా మార్చి అందులోని సారాంశం తెలుస్తుంది.
ఐటీ కారిడార్‌లో పోలీసు తనిఖీలు
గచ్చిబౌలి/మాదాపూర్: నగరంలో ఐసిస్ సానుభూతిపరుల అరెస్టుల నేపథ్యంలో నగర శివారు పోలీసులు ఐటీ కారిడార్, మాల్స్‌లో గురువారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాలలోని ఐటీ సంస్థల పరిసరాల్లో ప్రతి వాహనాన్ని పరిశీలించారు. రాయదుర్గం, గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలలో తనిఖీలు జరిగాయి. మాదాపూర్‌లోని పర్వత్‌నగర్, సైబర్ టవర్స్, ఇనార్బిట్ మాల్‌లో చేసిన తనిఖీల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పోలీస్ బృందాలు పాలుపంచుకున్నాయి.