
ఐఎస్ ముప్పు.. చైనాలో కలవరం!
అంతర్జాతీయ మత ఉగ్రవాదపు జాడలు దేశంలోనూ విస్తరిస్తున్నాయని చైనా అధికారులు ఆందోళన చెందుతున్నారు. చైనాకు చెందిన ముస్లిం మైనారిటీలు ఇరాక్, సిరియాలో ఇస్లామిక్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పోరాడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇస్లామిక్ ఉగ్రవాద ముప్పుపై తాజాగా చైనా అధికారులు హెచ్చరికలు జారీచేశారు. జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన అధికార కమ్యూనిస్ట్ పార్టీ టాప్ అధికారి షర్హాత్ అహాన్ తాజాగా ఉగ్రవాదజాడలపై హెచ్చరికలు చేయడం గమనార్హం. అంతర్జాతీయ ఉగ్రవాద పరిస్థితుల కారణంగా చైనా అస్థిరతకు లోనయ్యే అవకాశముందని, దీని ప్రజాయుద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ముస్లిం జనాభా అధికంగా ఉండే జింగ్‌జియాంగ్ ప్రావిన్స్ గత కొన్నాళ్లుగా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. ఇక్కడ స్థానిక వీఘర్ ముస్లిం తెగ ప్రజలు చైనా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఇటీవలికాలంలో ఇక్కడ చోటుచేసుకున్న హింసలో వందలమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇక్కడి వీఘర్ ఇస్లామిక్ వేర్పాటువాదులకు అల్‌కాయిదా, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చైనా ఆరోపిస్తున్నది.
వీఘర్ వేర్పాటువాదులతో చైనా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నది. వీఘర్ వేర్పాటువాదులకు తాము ఇరాక్‌లో శిక్షణ ఇస్తున్నామని, త్వరలోనే చైనాలో దాడులు జరుపుతామని ఇటీవల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూప్ ఓ వీడియోలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల జరిగిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లో మాట్లాడిన అర్హాత్ ఆహాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాలని, ప్రజల ఆస్తులను కాపాడేందుకు, చైనా శక్తిని చాటేందుకు కృతనిశ్చయాన్ని చాటాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో ఇప్పటికే జింగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో అధికార యంత్రాంగం గస్తీని ముమ్మరం చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారీ బహిరంగ ప్రదర్శనలు నిర్వహిస్తున్నది.