
ఇస్లామాబాద్ : ‘‘ఇప్పటికే అతను పాకిస్థాన్‌లోకి ఎంటరయ్యాడు. పేరు.. అబ్దుల్ వలీ. అతని పాస్‌పోర్ట్, వీసా డిటెయిట్స్ పంపిస్తున్నాం. గుర్తుంచుకోండి.. అతనికి కావాల్సింది చైనా రాయబారి ప్రాణాలు! ఒకవేళ అతను అనుకున్నది జరిగితే.. మన రెండు దేశాలకీ ఎంత నష్టమో మీకు తెలుసు. కాబట్టి జాగ్రత్త వహించండి. తక్షణమే మా రాయబారికి తగినంత భద్రత ఏర్పాటు చేయండి.’’...... ఇదీ..
ప్రతిష్టాత్మక చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ముఖ్యఅధికారి పింగ్ యింగ్ ఫీ, పాకిస్తాన్ అంతర్గత శాఖ మంత్రికి రాసిన లేఖ. కొద్ది గంటల కిందటే వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం పాక్‌లో సంచలనంగా మారింది.
ఎవరిని హత్య చేయబోతున్నారు? : అఫ్ఘనిస్థాన్‌లో చైనా రాయబారిగా పనిచేసిన యావో జింగ్.. అక్టోబర్ 19న పాక్‌లో చైనీస్ రాయబారిగా నియమితులయ్యారు. మొన్ననే ఇస్లామాబాద్‌కు వచ్చిన ఆయనను అంతం చేసేందుకు ఉగ్రవాదులు స్కెచ్ వేశారు. జింగ్ ప్రాణాలే లక్ష్యంగా ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటిమ్)కు చెందిన అబ్దుల్ వలీ అనే ఉగ్రవాది ఇప్పటికే ఇస్లామాబాద్‌లో మాటు వేశాడని చైనా చెబుతోంది. అతన్ని వెంటనే బంధించి తనకు అప్పగించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరింది.
ఎవరీ అబ్దుల్ వలీ? : ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో అంతుచిక్కకుండా తిరుగుతోన్న అబ్దుల్ వలీ సొంతదేశం చైనాయే!. అవును. చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్‌లో ఉయ్‌ఘర్ తెగకు చెందిన ముస్లింలు అధికంగా నివసిస్తూఉంటారు. అబ్దుల్ వలీ ఆ తెగకు చెందినవాడే. ఉయ్‌ఘర్ ముస్లింలు.. తాము చైనాలో కలిసి ఉండబోమని, ప్రత్యేక దేశం కావాలని ‘ఈస్ట్ టర్కిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్(ఈటిప్) పేరుతో ఉద్యమాలు చేస్తున్నారు. వారికి టర్కీ, కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, కిరిజిస్థాన్, పాకిస్థాన్, ఆప్ఘానిస్థాన్‌లో ఉండే ఉయ్‌ఘర్ ముస్లింల మద్దతు కూడా ఉంది.
పాక్‌లో స్పాట్ పెట్టారెందుకు? : ఇటీవలికాలంలో ఉధృతమైన ఈటిప్ ఉద్యమాన్ని చైనీస్ ప్రభుత్వం తన ఉక్కుపాదంతో అణిచేసింది. ఆ సంస్థను నిషేధించడంతోపాటు వేలమంది ఉయ్‌ఘర్ ముస్లింలను అరెస్టుచేసి జైళ్లలోకి నెట్టేసింది. ప్రభుత్వంపై కక్షను పెంచుకున్న ఈటిప్ స్లీపర్ సెల్స్.. తమకు అనుకూలమైన ప్రాంతాల్లో దాడులు చేయాలని పథకాలు వేశారు. పాక్‌లోని తమ స్నేహితుల సాయంతో అక్కడ పనిచేస్తోన్న చైనా అధికారులను అంతం చేయాలని స్కెచ్ వేశారు. అయితే వారి కదలికలపై చైనా గట్టి నిఘా ఉంచడంతో కట్టడి వీలైంది. తాజా ఉదంతంలోనూ దాడికి పాల్పడబోయేవాడి పేరు(అబ్దుల్ వలీ), వివరాలను చైనీస్ నిఘావర్గాలు పసిగట్టగలియాయి.
‘అధికారిక’ మౌనం : ‘పాక్‌లో చైనీస్ రాయబారి హత్యకు కుట్ర’ కథనాలు సంచలనం రేపుతున్నప్పటికీ ఇరుదేశాల ఉన్నతాధికారులు ఇప్పటివరకు నోరెమెదపలేదు. ఉన్నతస్థాయిలో జరిగిన ప్రత్యుత్తరాలు మీడియాకు ఎలా లీకయ్యాయి? అనేదానిపైనా వివరణ ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment