‘బాగ్దాదీ బతికే ఉండొచ్చు’
వాషింగ్టన్: అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉండొచ్చని అమెరికా టాప్ మిలిటరీ కమాండర్ అనుమానం వ్యక్తం చేశారు. తాము జరిపిన వైమానిక దాడుల్లో బాగ్దాదీ హతమైనట్లు రష్యా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ‘ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడని అనిపిస్తోంది’ అని యూఎస్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ స్టీఫెన్ టౌన్‌సెండ్ తెలిపారు. ఇరాక్, సిరియాల్లో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై దాడులు చేస్తున్న సంకీర్ణ దళాలకు స్టీఫెన్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.
అమెరికా పెంటగాన్‌లోని విలేకరులతో స్టీఫెన్.. బాగ్దాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘బాగ్దాదీ చనిపోయినట్లు ముందు నేను కూడా భావించాను. అయితే కొన్ని నిఘా వర్గాల సమాచారం చూస్తుంటే బాగ్దాదీ బతికే ఉన్నాడని అనిపిస్తోంది. అతడి కోసం మా దళాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. ఒకవేళ వారు అతడిని గుర్తిస్తే కచ్చితంగా చంపేస్తారే గానీ.. బందీగా పట్టుకోరు’ అని స్టీఫెన్ తెలిపారు. యుఫరేట్స్ నదిని ఆనుకొన్న ప్రాంతాల్లో బాగ్దాది దాగి ఉన్నట్లు తాము అంచనా వేస్తున్నామని స్టీఫెన్ అన్నారు.