ట్విట్టర్‌లో అబ్యూజ్ చేస్తే ఖాతాల కట్!
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో హింసాత్మక ధోరణలను ప్రేరేపించినా, కొంత మంది వ్యక్తులు, ముఖ్యంగా నిర్దిష్టమైన గ్రూపులకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసినా, వాటికి వ్యతిరేకంగా దుష్ర్పచారం చేసినా అలాంటి వ్యక్తుల ఖాతాలను తమ సంస్థ నుంచి తొలగిస్తామని ట్విట్టర్ మంగళవారం తన బ్లాగ్‌లో హెచ్చరించింది. కుల మతాలు, జాతి, దేశీయత, లింగ, లైంగికంగా వయస్సు, అంగవైకల్యం, జబ్బుల కారణంగా దూషించినా, అవమానించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ డైరెక్టర్ మేగన్ క్రిస్టినా హెచ్చరించారు.
ఇస్లామిక్ స్టేట్ లాంటి కొన్ని మిలిటెంట్ గ్రూపులు తమ ప్రచారానికి, తమ నియామకాలకు ట్విట్టర్‌ను ఉపయోగించుకుంటున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని క్రిస్టినా తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ పేరును నేరుగా పేర్కొనడం ఇదే మొదటిసారి. ఇలాంటి వారి ఖాతాలను తక్షణమే తొలగిస్తున్నామని, ముందుకూడా తొలగిస్తామని చెప్పారు. వ్యక్తులు లేదా గ్రూపులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని తాము ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని నైతికత పరిధిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దాటరాదని ఆయన హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో హింసను ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకుంటామంటూ ట్విట్టర్ ఇదివరకు జనరల్ వార్నింగ్ మాత్రమే ఇచ్చింది. ఈసారి మాత్రం కుల,మత, జాతి, లింగ వివక్షతలను పేర్కొంటూ స్పష్టంగా ఇచ్చింది.