క్యాష్ కూడా టార్గెట్!
వాషింగ్టన్: కేవలం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను మాత్రమే కాకుండా వారి డబ్బు నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడులు సత్ఫలితాలిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఐఎస్కు చెందిన 9 డబ్బు నిల్వ కేంద్రాలపై దాడులు జరిపి వందలాది మిలియన్ డాలర్లను ధ్వంసం చేసినట్లు దాడులకు నేతృత్వం వహిస్తున్న అమెరికా అధికార ప్రతినిధి స్టీవెన్ వారెన్ గురువారం ప్రకటించారు. ఇస్లామిక్ స్టేట్పై వేసవిలో ప్రారంభమైన దాడులు మొదలుకొని ఇటీవల ఇరాక్లోని మొసుల్లో సోమవారం జరిపిన వైమానిక దాడుల్లో భారీగా సంపద నిల్వ కేంద్రాలను ధ్వంసం చేసినట్లున్న వీడియో ఫోటేజీని వారెన్ ప్రదర్శించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రాబల్యం గల ప్రాంతాలపై కేవలం ఆర్థిక పరమైన ఆంక్షలు, ఇతర మార్గాల ద్వారా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రజల వద్ద నుండి అధికారికంగా వసూలు చేస్తున్న పన్నులు, బ్యాంకు లూటీలు, ఆయిల్ బిజినెస్ ద్వారా సంపాధించిన బిలియన్ డాలర్లు ఇస్లామిక్ స్టేట్ను పటిష్టమైన ఆర్థిక వనరులున్న ఉగ్రవాద సంస్థగా మార్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా ఉగ్రవాదుల నగదు నిల్వ స్థావరాలను లక్ష్యంగా చేసుకొని జరుపుతున్న దాడులు ఐఎస్ను ఆర్థికంగా దెబ్బతీశాయని అగ్రరాజ్యం ప్రకటించింది.