న్యూయార్క్: హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను నిలిపివేయాలని అమెరికా సహా 12 మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. లేనిపక్షంలో సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే చివరిసారి మరోసారి హెచ్చరికలు ఊహించకూడదని పేర్కొంటూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు.
"చట్టవిరుద్ధమైన దాడులను తక్షణమే ముగించాలి. నిర్బంధించిన ఓడలు, సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. హౌతీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. జలమార్గాలలో వాణిజ్య ప్రయాణాలపై బెదిరింపులకు పాల్పడితే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది." అని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి.
ఎర్రసముద్రంలో ఓడలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో అంతర్జాతీయ సహనం దెబ్బతింటుందని అమెరికా మిత్రదేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్‌డమ్ సంతకాలు చేశాయి.
ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడితో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. గాజాపై భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ వైపు 22 వేలకు పైగా మంది మరణించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న ప్రతి నౌకపై దాడి చేస్తున్నారు.
ఇదీ చదవండి: 73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment