అల్ కాయిదా అన్వర్ ప్రసంగంతో స్ఫూర్తి | Al Qaid Anwar speach at Student Islamic Organisation | Sakshi
Sakshi News home page

అల్ కాయిదా అన్వర్ ప్రసంగంతో స్ఫూర్తి

Published Sat, Jan 2 2016 2:57 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

అల్ కాయిదా అన్వర్ ప్రసంగంతో స్ఫూర్తి - Sakshi

అల్ కాయిదా అన్వర్ ప్రసంగంతో స్ఫూర్తి

సిట్‌కు తెలిపిన ‘ఐసిస్ త్రయం’లోని మాజ్ హుస్సేన్
సాక్షి, హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన ‘ఐసిస్ త్రయం’లో రెండో వాడైన మాజ్ హుస్సేన్ ఫారూఖ్ సీసీఎస్ ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. హుమాయున్‌నగర్‌లోని మాజ్ జమాత్ ఏ ఇస్లామీ (జేఈఐ) సంస్థకు చెందిన స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ (ఎస్‌ఐఓ)కూ అనుబంధంగా పని చేశాడు. ఇతడితో పాటు చిక్కిన ఒమర్ ఫారూఖ్ హుస్సేనీకి సైతం ఈ సంస్థతో సంబంధం ఉంది.

మాజ్ తరచుగా తన సెల్‌ఫోన్‌లోనే ఇంటర్‌నెట్‌ను బ్రౌజ్ చేసేవాడు. ఆన్‌లైన్‌లో ఉన్న అల్ కాయిదా కీలక నేత, యమన్‌కు చెందిన ఇంగ్లిష్ స్కాలర్ అన్వర్ అల్ అల్వాకీ రెచ్చగొట్టే ప్రసంగాలతో స్ఫూర్తి పొంది జిహాదీగా మారాలని నిర్ణయించుకున్నాడు. అల్ కాయిదా సంస్థకు ప్రధాన రిక్రూటర్‌గా, అధికార ప్రతినిధిగా అన్వర్‌కు పేరుంది. 2011 సెప్టెంబర్ 30న యమన్‌లో అమెరికా సేనలు జరిపిన డ్రోన్ దాడుల్లో మరణించాడు. అయినప్పటికీ ఇప్పటికీ అన్వర్‌కు చెందిన అనేక ప్రసంగాలు ఇంటర్‌నెట్, సోషల్ మీడియాల్లో అందుబాటు లో ఉన్నాయి. దీంతో పాటు మాజ్ పాలస్తీనా, గాజా స్ట్రిప్, అఫ్ఘానిస్థాన్, సిరియాల్లో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తీవ్ర ఉద్రేకాన్ని పొందేవాడు.
 
సామాజిక సైట్లే వారధి...
ఈ నేపథ్యంలో బాసిత్, ఒమర్ ఫారూఖ్‌లతో కలిసి ఐసిస్, అల్ కాయిదా వంటి సంస్థల్లో చేరాలని ప్రేరణ పొందాడు. ఫేస్‌బుక్, ట్వీటర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లను తరచుగా ఫాలో అవు తూ... వాటి ద్వారానే అనేక మంది ఐసిస్ సానుభూతిపరులతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. దీనికోసం ఐదు రకాల సోషల్ మీడియాల్లో ఖాతాలు తెరిచాడు. దాదాపు ఆరు నెలలుగా మిగిలిన ఇద్దరితో కలిసి హుమాయున్‌నగర్‌లోని తన ఇంట్లో సమావేశాలు నిర్వహించినా... చివరకు నల్లగొండలో జరిగిన కార్యక్రమానికి హాజరైనప్పుడే నాగ్‌పూర్ మీదుగా శ్రీనగర్ చేరుకుని దేశ సరిహద్దులు దాటాలని నిర్ణయించుకున్నారు.

మాజ్ 2014లోనూ  బాసిత్, అబ్రార్, నోమన్‌లతో కలసి కోల్‌కతా మీదుగా బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్రయత్నించిన విషయం తెలిసిందే. అప్పట్లో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఈ నలుగురూ కోల్‌కతా చేరుకున్న తరవాత అక్కడి న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న హోటల్ సిల్వర్‌లో బస చేశారు. ఈలోపు విషయం గుర్తించిన నగర పోలీసులు కోల్‌కతా అధికారుల్ని అప్రమత్తం చేయడం, ఫలితంగా పోలీసులకు చిక్కి తిరిగి హైదరాబాద్ చేరుకోవడం జరిగాయి.

ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ‘ఐసిస్ త్రయం’ ఈసారి నాగ్‌పూర్‌లోని ఏ హోటల్‌లోనూ బస చేయలేదు. దాదాపు 20 గంటల పాటు ఉన్నా... ఆటోల్లో సంచరిస్తూ, సినిమా లు చూస్తూ కాలక్షేపం చేశామని మాజ్ విచారణలో చెప్పాడు. తనతో పాటు ఒమర్, బాసిత్‌లకూ ఈ తరహా భావజాలమే ఉందన్నాడు. ఈ త్రయం నగరంలోని మరికొందరితోనూ సంప్రదింపులు జరిపినట్లు సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారని తెలిసింది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానం మంగళవారం నిర్ణయం వెలువరించనుంది.
 
మాజ్ ‘ఐడీ’లు ఇవే...
జీమెయిల్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్: maazhasan27@gmail.com  
ఫేస్‌బుక్, యాహూ: maaz_hunk17@yahoo.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement