♦ ‘ఐసిస్ త్రయం’ విషయంలో తర్జనభర్జన
♦ నాగ్‌పూర్ నుంచి నగరానికి తరలింపు
♦ మిస్సింగ్ కేసులు మూడూ సిట్‌కు బదిలీ
♦ ఒకసారి చేసిన కౌన్సెలింగ్‌తో ఫలితం శూన్యం.. కేసులు నమోదు చేస్తే ప్రచారమనే భావనలో పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐసిస్)లో చేరేందుకు వెళ్తూ మహారాష్ట్రలోని నాగ్‌పూర్ విమానాశ్రయంలో చిక్కిన ముగ్గురు హైదరాబాద్ యువకులు అబ్దుల్ బాసిత్, హసన్ ఫారూఖ్, ఫారూఖ్ హుస్సేనీలను ఆదివారం నగరానికి తరలించారు. శ్రీనగర్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వీరిని మహారాష్ట్ర యాంటీ టైస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) అధికారులు శనివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సమాచారం అందుకుని మహారాష్ట్ర వెళ్లిన రాష్ట్ర నిఘా విభాగానికి చెందిన ప్రత్యేక బృందం వారిని హైదరాబాద్ తీసుకువచ్చింది. ఈ ముగ్గురూ అదృశ్యం కావడంపై చాంద్రాయణగుట్ట, హుమాయూన్‌నగర్ పోలీసుస్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ మూడు కేసుల్నీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కు బదిలీ చేస్తూ నగర పోలీసు కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముగ్గురు యువకుల్నీ నిఘా విభాగం అధికారులు సిట్‌కు అప్పగించారు.
ఏం చేయాలని తర్జనభర్జన..
ఈ ముగ్గురిలో ఇద్దరు యువకులు ‘పాత వారే’. గత ఏడాది సెప్టెంబర్‌లో పశ్చిమ బెంగాల్ మీదుగా దేశ సరిహద్దులు దాటి సిరియా వెళ్లేందుకు ప్రయత్నించిన నలుగురిలో అబ్దుల్ బాసిత్, హసన్ ఫారూఖ్ కూడా ఉన్నారు. అప్పట్లో బాసిత్ రాసిన లేఖ ద్వారా విషయం వెలుగులోకి రావడంతో కుటుంబీకులు, మత పెద్దల ద్వారా సమాచారం తెలుసుకున్న నగర పోలీసులు.. రాష్ట్ర నిఘా వర్గాల సహకారంతో కోల్‌కతా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ఈ నలుగురినీ పట్టుకున్న అధికారులు రాష్ట్ర పోలీసులకు అప్పగించారు. అప్పట్లో వీరిని తీసుకువచ్చిన నిఘా విభాగం తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి అప్పగించింది.
వీరికి ఇంటర్‌నెట్, సెల్‌ఫోన్ తదితరాలు అందుబాటులో లేకుండా కుటుంబీకులు చర్యలు తీసుకున్నారు. అయినా మరోసారి సిరియా వెళ్లాలనే ఉద్దేశంతో ప్రయాణమార్గం మార్చుకుని వెళ్తూ నాగ్‌పూర్‌లో చిక్కారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కౌన్సెలింగ్‌తో సరిపెట్టకూడదని, కేసులు నమోదు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ రకంగా కేసులు నమోదు చేస్తే భారీ ప్రచారం జరగడంతో పాటు మరికొందరూ ఈ బాటపట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిఘా, సిట్ అధికారులు ఏం చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఈ ముగ్గురిపై కేసుల నమోదుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
సంబంధాల నేపథ్యంలో అప్రమత్తం..
సాధారణ వ్యక్తులైతే కేసు నమోదుకు వెనుకాడినా ఫర్వాలేదని, వీరిలో ఇద్దరికి ఉన్న సంబంధాల నేపథ్యంలో తప్పనిసరని అధికారులు భావిస్తున్నారు. బాసిత్ స్వయానా నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా(సిమి) జాతీయ మాజీ అధ్యక్షుడు సలావుద్దీన్‌కు సమీప బంధువు. ఫారూఖ్ సైతం ఇతడికి సమీప బంధువే. దీనిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు వీరికి సిమి పాత క్యాడర్‌తో సంబంధాలుండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈసారి కేసులు నమోదు చేయకుండా ఉపేక్షిస్తే ఐసిస్ విషవృక్షం విస్తరించే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. వీరిపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలనేది సోమవారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఆధారాల కోసం లోతుగా విచారణ..
ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయాల్సి వస్తే అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయాల్సి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అలా చేయడానికి కొన్ని ఆధారాలు అవసరమవుతాయి. ఐసిస్‌లో చేరడానికే వెళ్తూ కొన్ని నెలల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలో దొరికిన సల్మాన్ మొయినుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఇతడి విషయంలో ఫేస్‌బుక్ ఖాతాతో పాటు సోషల్ మీడియా ద్వారానూ అఫ్సా జబీన్ అలియాస్ నిక్కీ జోసెఫ్ అనే మహిళ తదితరులతో సంప్రదింపులు జరిపినట్లు ఆధారాలు ఉన్నాయి. అబ్దుల్ బాసిత్, హసన్ ఫారూఖ్, ఫారూఖ్ హుస్సేనీ విషయానికి వస్తే వీరు ఇంటర్‌నెట్‌లో ఉన్న వీడియోలు, ఫొటోల స్ఫూర్తితో తమంతట తాముగా ఐసిస్ వైపు ఆకర్షితులయ్యారన్నది ఇప్పటి వరకు బహిర్గతమైన అంశం. మరోవైపు వీరు శ్రీనగర్ వెళ్లే ప్రయత్నాల్లో పట్టుబడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్‌లాఫుల్ యాక్టివిటీస్ కింద కేసు నమోదు సాధ్యం కాదు. దీనిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఆధారాల కోసం ముగ్గురినీ లోతుగా విచారిస్తున్నారు.
ఆ ముగ్గురిపై కేసా.. కౌన్సెలింగా?
Published Mon, Dec 28 2015 1:40 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement