ఉగ్రవాదుల సమావేశంపై వైమానిక దాడి
కాబూల్: తమ వైమానిక దళం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను గట్టి దెబ్బకొట్టిందని అఫ్ఘనిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రహస్యంగా సమావేశం నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై దాడులు జరిపి దాదాపు 40 మందిని హతం చేశామని వెల్లడించింది.
రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ దాలత్ వజిరి ఈ వివరాలు తెలియజేస్తూ గురువారం రాత్రి అచిన్ జిల్లాలోని పిఖా లాతాబాండ్ లో ఉగ్రవాదులంతా సమావేశమై చర్చించుకుండగా తమ వైమానిక దళం నేర్పుగా దాడులు చేసిందని, ఈ దాడుల్లో 40మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువమంది విదేశాల నుంచి ఐసిస్ రిక్రూట్ చేసుకున్నవారే ఉన్నారని వెల్లడించారు. వీరిలో చాలామందిని స్థానికులు తీసుకొని వెళ్లారని, ఉగ్రవాద సంస్థకు మృతదేహాలను అప్పగించారని అన్నారు.