ఇది భారత్‌కు ప్రమాదకరం: నిఘావర్గాలు
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఇటీవలి కాలంలో సంకీర్ణ బలగాల చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో వివిధ దేశాల నుంచి సిరియా, ఇరాక్‌లకు వెళ్లి అక్కడ ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారు.. తిరిగి స్వదేశాలకు పయనమయ్యే అవకాశాలు పెరిగాయని తెలుస్తోంది. భారత్ నుంచి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ తరఫున పోరాడుతున్న వారి సంఖ్య 40 నుంచి 50 మంది వరకు ఉంటుందని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అంచనావేస్తున్నాయి.
సంకీర్ణ సేనల దాడులతో ఇస్లామిక్ స్టేట్ తమ ప్రాబల్యం కలిగిన ప్రాంతాలను క్రమంగా కోల్పోతున్న నేపథ్యంలో భారత్ నుంచి వెళ్లిన యువత తిరిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి వెల్లడించారు. యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించి.. ఇస్లామిక్ స్టేట్‌తో పూర్తిగా ప్రభావితమై ఉన్న వీరు.. దేశంలో ఉగ్రచర్యలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుత ఆన్‌లైన్ రాడికలైజేషన్ ట్రెండ్ కన్నా ఇది ప్రమాదకరమైనది అని ఆయన వ్యాఖ్యానించారు.