చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుండి తిరుగుబాట పట్టారని సమాచారం. ఉత్తరాఖండ్‌కు చేరుకున్న తరువాత కూడా చార్‌ధామ్ యాత్ర చేయలేకపోవడం విచారకరమని వారు వాపోతున్నారు. యాత్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆపివేసిన నేపధ్యంలో సుమారు 12 వేల మంది యాత్రికులకు ధామ్‌లను సందర్శించడానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రకటించింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యారూపం దాల్చలేదు. దీంతో పలువురు యాత్రికులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.
ట్రాన్సిట్ క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు వేల మంది యాత్రికులకు మాత్రమే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో మిగిలిన ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్‌ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దాదాపు రెండున్నర వేల మంది యాత్రికులు ఇప్పటికీ ట్రాన్సిట్ క్యాంపు ప్రాంగణం, ధర్మశాలలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు.
ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మే 31తో నిలిపివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. అయితే ట్రాన్సిట్ క్యాంపులో ఉన్న యాత్రికులలో సుమారు 800 మంది ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. కాగా ఈ యాత్రికులకు వసతి, భోజన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment