
ఐసిస్‌ను స్థాపించింది ఒబామానే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ అడ్డుఅదుపు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్య
సన్‌రైజ్: ఉగ్రవాద సంస్థ ఐసిస్ వ్యవస్థాపకురాలంటూ హిల్లరీ క్లింటన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఒబామా పైనా అవే ఆరోపణలు చేశారు. ఐసిస్ వ్యవస్థాపకుడు ఒబామానేనంటూ తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీతో పోటీపడుతున్న ట్రంప్... ఫ్లోరిడాలోని ఫోర్ట్ లౌడర్‌డేల్ వద్ద జరిగిన భారీ ప్రచార సభలో ఆవేశంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ‘బరాక్ హుస్సేన్ ఒబామా’ అంటూ దేశాధ్యక్షుడి పూర్తి పేరును నొక్కి మరీ చెప్పారు. హిల్లరీ క్లింటన్‌పైనా మరోసారి విరుచుకుపడ్డారు.
‘ఒబామా ఐసిస్ స్థాపకుడు. హిల్లరీ దానికి సహ వ్యవస్థాపకురాలు. వీరిద్దరూ మధ్యప్రాచ్య విధానాలతో ఇరాక్‌లో అధికార శూన్యతను సృష్టించి, ఐసిస్ వేళ్లూనుకోవడానికి దోహదపడ్డారు’ అని ట్రంప్ అన్నారు. ఇరాక్‌లోని అమెరికా దళాలను వెనక్కి రప్పించడాన్ని తప్పుబడుతూ.. ఒబామా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇరాక్‌లో అస్థిరత ఏర్పడిందన్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించడానికి శ్వేతసౌధం నిరాకరించింది.