ఏడాది పిల్లాడితో ఐసిస్‌లో చేరింది!
లండన్: ఏడాది వయస్సున్న పిల్లాడిని తీసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపులో చేరేందుకు సిరియా వెళ్లిందో బ్రిటన్ మహిళ. అక్కడ పరిస్థితులు బాగలేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ బ్రిటన్‌లో అడుగుపెట్టింది. ఈ మేరకు తరీనా షకిల్ (26)ను కోర్టు దోషిగా తేలింది. ఐసిస్ (ఐఎస్ఐఎస్) సభ్యురాలిగా ఉండి ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించినందుకు బ్రిటన్ కోర్టు ఆమెను దోషిగా ప్రకటించింది. సోమవారం తరీనాకు శిక్ష ఖరారు కానుంది. దీంతో సిరియా వెళ్లి తిరిగి బ్రిటన్ వచ్చిన తొలి మహిళ నేరస్తురాలిగా పేరుబడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2014 అక్టోబర్ నెలలో తరీనా తన ఏడాది కొడుకుతోపాటు ఓ విమానంలో టర్కీ వెళ్లింది. అక్కడి నుంచి సిరియా సరిహద్దులు దాటి ఐసిస్ పేర్కొంటున్న కలిఫత్‌లో చేరింది. అక్కడ మూడు నెలలు గడిపిన అనంతరం గత ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ తిరిగి వచ్చింది. ఆమెను బ్రిటన్ రాగానే ఉగ్రవాద నిరోధక దళం అధికారులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడినట్టు, పిల్లాడిని నిర్లక్ష్యం చేసినట్టు అభియోగాలు మోపారు.
ఏడాది చిన్నారిని తల్లి నుంచి వేరుచేసి ఓ సంరక్షణ గృహానికి తరలించారు. అయితే పోలీసుల ఆరోపణలను ఆమె తోసిపుచ్చింది. కఠినమైన ఇస్లామిక్ చట్టాల ప్రకారం జీవించాలనే సిరియా వెళ్లానని, తాను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చింది. అయితే ఐసిస్ ఉగ్రవాదులతో, ఆ గ్రూపు జెండాతో ఆమె దిగిన ఫొటోలు, ఆమె సిరియాకు వెళ్లేముందు ఐసిస్‌లో చేరాలంటూ పిలుపునిస్తూ చేసిన ట్వీట్లను పోలీసులు ఆధారాలుగా కోర్టు ముందు ఉంచారు. దీంతో ఆమెను కోర్టు దోషిగా ఖరారు చేసింది.