'ఆ పోలీస్‌ను చంపింది మేమే'
ఆల్జియర్స్: అల్జీరియాలో ఓ పోలీసు అధికారిని కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేస్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేసి దారుణంగా కాల్చిచంపారు. అయితే.. ఈ ఘటనకు పాల్పడింది తామే నంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
అల్ ఖాయిదా సంస్థ ఉత్తర ఆఫ్రికా విభాగం, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలు చాలా కాలంగా అల్జీరియా ప్రభుత్వానికి వ్యతిరేంకంగా పనిచేస్తుండగా ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ అక్కడ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. శుక్రవారం కాన్‌స్టాంటిన్‌లో జరిగిన పోలీస్ అధికారి హత్యకు పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఫైటర్‌లు అని, హత్య అనంతరం అతడి గన్‌ను సైతం వారు స్వాధీనం చేసుకున్నారని ఇస్లామిక్ స్టేట్ అనుబంధ వార్తా సంస్థ అమాక్ పేర్కొంది. ఇందులో ఐఎస్ ఫైటర్లు స్వాధీనం చేసుకున్న గన్ ఇదేనంటూ ఫోటోను సైతం ప్రచురించింది. అల్జీరియా అధికారులు మాత్రం గుర్తుతెలియని ఉగ్రవాదుల దాడిలో పోలీసు అధికారి మృతి చెందినట్లు వెల్లడించినప్పటికీ.. ఇస్లామిక్ స్టేట్ ప్రకటనపై మాట్లాడేందుకు నిరాకరించారు.