బాగ్దాద్ లో మరో మారణ హోమం
బాగ్దాద్: కారు బాంబు దాడితో ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి దద్దరిల్లింది. కారు బాంబులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చి వేసుకోవడంతో 17 మంది మృతి దుర్మరణం చెందారు. పదులమంది తీవ్ర గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు. బాధితులంతా కూడా దినసరి కూలీలు, శ్రామికులు అని వారు వెల్లడించారు. బాగ్దాద్‌కు ఈశాన్యంలోని సదర్ నగరంలోని ఓ చోట ప్రతి రోజు కూలి పనులకు వెళ్లేందుకు పెద్దమొత్తంలో గుమికూడి ఉంటుంటారు. వీరిని లక్ష్యంగా చేసుకొని ఓ ఉగ్రవాది కారు నిండా బాంబులతో వెళ్లి ఆత్మాహుతి దాడికి దిగాడు.
ఒక్కసారిగా వారి మీదకు తీసుకెళ్లి కారుతో సహా పేల్చేసుకున్నాడు. దీంతో 17మంది శ్రామికులు అక్కడికక్కడే మృత్యువాతపడగా 39మంది గాయాలపాలయ్యారు. గత మూడు రోజుల్లో ఇది రెండో అతిపెద్ద దాడి. శనివారం సెంట్రల్ బాగ్దాద్‌లో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో 27మంది మృత్యువాతపడిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం జరిగిన బాంబు దాడిని తామే చేశామని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు. అయితే, గతంలో జరిగిన బాంబు దాడులన్నీ కూడా ఇస్లామిక్ స్టేట్ జరిపిన విషయం తెలిసిందే.