ఉగ్రవాదుల దాడిలో 24 మంది మృతి
బాగ్దాద్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు. మోసుల్ పట్టణంలోని సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని శనివారం దాడి చేసిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 24 మందిని హతమార్చినట్లు ప్రెస్ టీవీ వెల్లడించింది. కాగా.. శుక్రవారం ఖయ్యరా ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ జరిపిన రెండు కారు బాంబు దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడిన విషయం తెలిసిందే.
మోసుల్‌కు దక్షిణంగా 60 కిలోమీటర్ల దూరంలో ఉండే ఖయ్యరాను ఇరాకీ సేనలు ఆగస్టు చివర్లో తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అనంతరం ఆపరేషన్ మోసుల్‌ను చేపట్టిన ఇరాకీ సేనలకు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురౌతుంది. ప్రస్తుతం మోసుల్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోందని ఇరాక్‌కు చెందిన అల్మాడా ప్రెస్ వెబ్‌సైట్ వెల్లడించింది.