యుద్ధభూమిలో ప్రశాంతత
ఐదేళ్ల తరువాత కాల్పులు లేని సిరియా
డమాస్కస్: సుదీర్ఘ కాలంగా బాంబుల మోతలతో దద్దరిల్లిన యుద్ధభూమి సిరియాలో ప్రశాంతత. అమెరికా, రష్యాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో ఐదేళ్లుగా సాగుతున్న మారణహోమానికి ఉపశమనం..! రాజధాని డమాస్కస్ చుట్టుపక్కల పరిసరాలు, విధ్వంసమైన అలెప్పో నగరాల్లో శనివారం తూటాల చప్పుళ్లు వినిపించలేదు. ఐదేళ్లుగా అంతర్యుద్ధంలో 2,70,000 మంది మరణించారు. దేశ జనాభాలో సగం మంది నిర్వాసితులయ్యారు. మార్చి 7న శాంతి చర్చలు పునరుద్ధరిస్తామని అమెరికా రాయబారి స్టెఫాన్ డి మిస్టుర చెప్పారు. జెనీవాలో ప్రత్యేక దళాలు సమావేశమయ్యి ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తాయన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చుకోవడం ముఖ్యమన్నారు. తమ పిల్లలను పార్కుకు తీసుకెళుతున్న దృశ్యాలు అలెప్పోలో కనిపించాయన్నారు. కాగా, హామా దగ్గర్లోని సలామియహ్‌లో పేలుళ్లకు ఇద్దరు సైనికులు మరణించారని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది.
ఐసిస్‌ను అంతమొందిస్తాం: ఒబామా
వాషింగ్టన్: నరమేధం సృష్టిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద సంస్థను అంతమొందిస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శనివారం చెప్పారు. సిరియా అంతర్యుద్ధానికి చరమగీతం పాడటం ఎంతో కీలకమన్నారు. ‘ఐసిస్‌తో యుద్ధం క్లిష్టమైంది. కానీ దాన్ని తుదముట్టించడానికి శక్తియుక్తులన్నీ ఒడ్డుతాం. ఇందులో విజయం సాధిస్తామన్న నమ్మకం నాకుంది’ అని అన్నారు. ‘66 దేశాలు ఈ పోరాటానికి మద్దతు పలుకుతున్నాయి. ఇరాక్‌లో 40 శాతానికి పైగా ప్రాంతాల్లో ఐఎస్‌ఐఎల్ పట్టు కోల్పోయింది. సిరియాలో కూడా ఉగ్రవాద సంస్థలకు తీవ్ర ప్రతిఘటన ఎదురువుతోంది. రెండు దేశాల్లో రానురాను వారి బలం తగ్గుతోంది. వారు ఇకపై రిక్రూట్‌మెంట్లు చేసుకోవడం కూడా కష్టమే’ అని వెల్లడించారు.