ఇక ఐఎస్ కన్ను పర్యాటక ప్రాంతాలపై..
రోమ్: యూరప్ సముద్ర తీరాల్లో వేసవి విడిది కోసం వచ్చే పర్యాటకులే లక్ష్యంగా భారీ బాంబు పేలుళ్లకు ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు కుట్రపన్నారు. ముఖ్యంగా స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్ రిసార్ట్‌లను లక్ష్యంగా చేసుకోవాలని, బీచ్ ఒడ్డున సన్ బెడ్‌ల కింద బాంబులు అమర్చాలని, పర్యాటకులకు ఐస్‌క్రీమ్‌లు, స్నాక్‌లు, టీషర్టులు అమ్మే హ్యాకర్ల అవతారంలో ఆత్మాహుతి జాకెట్లను ధరించి వెళ్లాలంటూ టెర్రరిస్టు నాయకులు తమ అనుచరులకు తాజా ఆదేశాలు జారీ చేసినట్లు జర్మనీ, ఇటలీ ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
రిసార్ట్‌లపై జరిపే దాడుల్లో బాంబులు, ఆత్మాహుతి జాకెట్లతోపాటు ఆటోమేటిక్ మిషన్ గన్లను ఉపయోగించేందుకు కూడా టెర్రరిస్టులు వ్యూహం పన్నినట్లు ఆఫ్రికా నుంచి తమకు పక్కా సమాచారం అందిందని ఇటలీ ఇంటెలిజెన్స్ వర్గాలు బుధవారం తెలిపాయి. మధ్య ప్రాచ్యంలో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను యూరప్ సంకీర్ణ దళాలు బలంగా తిప్పికొడుతుండడంతో సైనిక బలగాలు ఉండని పర్యాటక ప్రాంతాలను తమ లక్ష్యంగా చేసుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి.
టునీషియా బీచ్ రిసార్ట్‌లో గతేడాది ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు దాడులు జరిపి 38 మంది పర్యాటకులను హతమార్చిన విషయం తెల్సిందే. మృతుల్లో ఎక్కువ మంది బ్రిటన్ దేశస్థులే ఉన్నారు. నైజీరియాలో క్రియాశీలకంగా ఉన్న బొకోహరాం టెర్రరిస్టు గ్రూప్ ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులతో చేతులు కలపడం వల్ల ప్రమాదం తీవ్రంగానే ఉండవచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఏ దేశం కూడా ట్రావెల్ అలర్ట్‌లను ప్రకటించలేదు.