కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ | Four militants gunned down in Kashmir | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Published Sat, Jun 23 2018 2:21 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

Four militants gunned down in Kashmir - Sakshi

ఎన్‌కౌంటర్‌లో పూర్తిగా ధ్వంసమైన ఉగ్రవాదులు దాక్కున్న ఇల్లు

శ్రీనగర్‌: కశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ ఎన్‌కౌంటర్‌ చేశాయి. శుక్రవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిపిన ఎన్‌కౌంటర్‌లో జమ్మూ కశ్మీర్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌జేకే) చీఫ్‌ దావూద్‌ అహ్మద్‌ సోఫీ సహా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ పోలీసు, మరో పౌరుడు మృతిచెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. పలు హత్య కేసు లు, భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఘటనల్లో సోఫీ కీలక నిందితుడని తెలిపారు. వచ్చే వారం (జూన్‌ 28 నుంచి) అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్‌ భద్రతాబలగాలకు నైతిక బలాన్నిచ్చింది. మరోవైపు, పుల్వామా జిల్లాలోని త్రాల్‌ మార్కెట్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ ఘటనలో తొమ్మిది మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

తెల్లారేసరికి ఆపరేషన్‌ పూర్తి
శుక్రవారం తెల్లవారుజామునే ఈ ఆపరేషన్‌ మొదలుపెట్టిన భద్రతా బలగాలు.. తెల్లారేసరికి పనిపూర్తి చేశాయి. ఉగ్రవాదులు దాక్కున్నారన్న ఇంటెలిజెన్స్‌ నివేదికల ఆధారంగా అర్థరాత్రే బలగాలు చేరుకున్నాయి. అయితే.. తెల్లవారాకే మృతుల్లో దావూద్‌ సోఫీ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఐఎస్‌జేకే సభ్యులైన ఆదిల్‌ రెహమాన్‌ భట్, మహ్‌మద్‌ అష్రఫ్‌ ఇటూ, మాజిద్‌ మంజూర్‌ దార్‌లుగా గుర్తించినట్లు కశ్మీర్‌ రేంజ్‌ ఐజీ స్వయం ప్రకాశ్‌ పాణి వెల్లడించారు. ‘ఈ ఆపరేషన్‌ విజయవంతమైంది. రాష్ట్ర పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు సమన్వయంతో పని పూర్తిచేశారు. ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో ఖిరం గ్రామానికి వెళ్లిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఓ ఇంట్లో దాక్కున్నారు. ఇంటిని చుట్టుముట్టిన బలగాలు ఆపరేషన్‌ పూర్తి చేశాయి’ అని ఆయన వెల్లడించారు.

భారత్‌కు ఐఎస్‌ ముప్పు!
ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న ఐఎస్‌ ప్రభావం భారత్‌లో పెద్దగా లేదని.. మన ప్రభుత్వం మొదట్నుంచీ చెబుతోంది. కశ్మీర్‌లోనూ మిగిలిన ఉగ్రవాద సంస్థలతో పోలిస్తే.. ఐఎస్‌ ప్రభావం అసలేమాత్రం లేదని చెప్పుకొస్తోంది. కానీ కొంతకాలంగా కశ్మీర్‌లో ఐఎస్‌ జెండాలు కనబడుతున్నాయి. రాళ్లు రువ్విన ఘటనల చిత్రాల్లో యువకుల చేతిలో ఐఎస్‌ జెండాలు కనిపిస్తూనే ఉన్నాయి. అనంత్‌నాగ్‌లో శుక్రవారం నాటి ఎన్‌కౌంటర్‌తో ఐఎస్‌ లోయలో ఐఎస్‌ ప్రభావం ఉన్నట్లు సుస్పష్టమైంది. జమ్మూకశ్మీర్‌ కోసం ఐఎస్‌ ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటుచేసుకున్నట్లు తేలింది. ఏ++ కేటగిరీ (ఉగ్రవాదుల స్థాయిని బట్టి భద్రతా బలగాలు ఇచ్చే రేటింగ్‌) ఉన్న జేకేఐఎస్‌ చీఫ్‌ దావూద్‌ సోఫీని హతమార్చటం ద్వారా.. లోయలో విస్తరించేందుకు ఐఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తుందనేది సుస్పష్టమైంది.

హిట్‌ లిస్ట్‌తో ఆర్మీ ఆపరేషన్‌
కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భద్రతా బలగాలు ‘ఆపరేషన్‌ ఆలౌట్‌’ను ప్రారంభించాయి. బలమైన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఏర్పాటుచేసుకుని.. ఒక్కో ఉగ్రవాద సంస్థను, అందులోని ముఖ్యనేతలను పక్కాగా టార్గెట్‌ చేస్తూ  22మందితో జాబితాను సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ (11 మంది), లష్కరే తోయిబా (7), జైషే మహ్మద్‌ (2), అన్సార్‌ ఘజ్వత్‌ ఉల్‌ హింద్, జేకేఐఎస్‌ల నుంచి ఒక్కొక్కరు ఈ జాబితాలో ఉన్నారు. జేకేఐఎస్‌ చీఫ్‌ హతంతో ఈ జాబితా 21కి చేరింది.

భద్రతను సమీక్షించిన విజయ్‌
జమ్మూకశ్మీర్‌ గవర్నర్‌ సలహాదారుగా నియమితుడైన రిటైర్డు ఐపీఎస్‌ అధికారి కె. విజయ్‌ కుమార్‌ కశ్మీర్‌ లోయలోని భద్రతా పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం ఉదయమే ఆయన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు. అటు, గవర్నర్‌ రూల్‌ అమల్లోకి రావడంతో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ భేటీలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తరపున ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిలావర్‌ మిర్‌ సహా.. వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ గవర్నర్‌ను కలిసి.. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. జూన్‌ 28 నుంచి 60 రోజుల పాటు జరిగే అమర్‌నాథ్‌ యాత్రలో యాత్రికుల వాహనాలకు ట్రాకింగ్‌ చిప్స్‌ను అమర్చనున్నట్లు జమ్మూ రేంజ్‌ ఐజీ ఎస్‌డీ సింగ్‌ పేర్కొన్నారు. ఈ సాంకేతికతతో యాత్రికులు, వారి వాహనాల భద్రతను నిరంతరం పర్యవేక్షించవచ్చు.

ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా?: జైట్లీ
న్యూఢిల్లీ: సామాన్య పౌరుల మానవహక్కుల్ని పరిరక్షించేందుకు ఉగ్రవాదుల పట్ల కఠిన వైఖరిని అవలంబించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. చంపడానికి, చావడానికి సిద్ధమై వస్తున్న ఉగ్రవాదుల్ని సత్యాగ్రహంతో ఎదుర్కోవాలా? అని ప్రశ్నించారు. కశ్మీర్‌లో సైనిక ఆపరేషన్లలో ఉగ్రవాదుల కంటే అమాయక ప్రజలే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆజాద్‌ వ్యాఖ్యానించడంపై జైట్లీ మండిపడ్డారు. ‘ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు చావడానికి సిద్ధంగా ఉంటాడు.

అతను ఇతరుల్ని చంపడానికీ వెనుకాడడు. అలాంటివాళ్లు ఎదురుపడినప్పడు వారిని సత్యాగ్రహంతో ఎదుర్కోమంటారా? ఉగ్రవాది చంపడానికి ముందుకొస్తుంటే భద్రతాబలగాలు అతడిని చర్చలు జరిపేందుకు ఆహ్వానించాలా?’ అని ప్రశ్నించారు. మావోయిస్టుల మద్దతున్న మానవహక్కుల సంఘాలు వేర్పాటువాదం, హింసను ప్రోత్సహిస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి గ్రూపుల్ని కాంగ్రెస్‌ గతంలో వ్యతిరేకించినా జేఎన్‌యూ, హెచ్‌సీయూలో దేశవ్యతిరేక నినాదాలు ఇచ్చినవారితో చేతులు కలిపేందుకు రాహుల్‌ గాంధీకి ఎలాంటి ఇబ్బంది లేదని విమర్శించారు.

కశ్మీరీల తొలి ప్రాధాన్యం స్వాతంత్య్రమే
కాంగ్రెస్‌ నేత సోజ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సైఫుద్దీన్‌ సోజ్‌ శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలకు ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అవకాశమిస్తే వారు స్వతంత్రంగా ఉండేందుకే మొగ్గుచూపుతారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమనీ, పార్టీకి దానితో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో సోజ్‌ మాట్లాడుతూ.. ‘కశ్మీరీలు పాకిస్తాన్‌లో విలీనం కావాలనుకోవడం లేదని ముషార్రఫ్‌ చెప్పారు. ఎవరితో ఉండాలో నిర్ణయించుకునే అధికారం కశ్మీరీలకు ఇస్తే వారు స్వతంత్ర కశ్మీర్‌కే తొలి ప్రాధాన్యం ఇస్తారన్నారు.

ఆయన చెప్పింది అప్పటికీ, ఇప్పటికీ నిజమే. నేను కూడా అదే చెప్పాను. కానీ కశ్మీర్‌కు స్వాతంత్య్రం రావడం అన్నది అసాధ్యమని నాకూ తెలుసు’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి తీవ్రనిరసన వ్యక్తమైంది. దీంతో సోజ్‌ వ్యాఖ్యల్ని కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా ఖండించారు. జమ్మూకశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగంగా ఉందనీ, భవిష్యత్‌లోనూ ఉంటుందనీ స్పష్టం చేశారు. త్వరలో మార్కెట్‌లోకి రానున్న తన పుస్తకం అమ్మకాలను పెంచుకునేందుకే సోజ్‌ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేశారని సూర్జేవాలా విమర్శించారు. కాగా సోజ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement