షాకింగ్ న్యూస్
ముంబై: షాకింగ్ న్యూస్. ముంబైలో ఓ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఐదుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వెళ్లినట్టు సమాచారం. కేరళ నుంచి అదృశ్యమైన పది మంది ఐసిస్ లో చేరినట్టు అనుమానాలు బలపడుతుండగా తాజాగా వెలుగు చూసిన ఉదంతం మరింత భయాందోళన కలిగిస్తోంది.
వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ తన భార్య, బిడ్డను తీసుకుని పశ్చిమాసియాకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు సోదరులు అతడితో కలిశారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది. 26 ఏళ్ల అష్ఫాక్ తన భార్యాబిడ్డ, సోదరులు మహ్మద్ సిరాజ్(22), ఇజాజ్ రెహ్మాన్(30)లతో పాటు ఈ ఏడాది జూన్ లో దేశం విడిచిపెట్టి ఐసిస్ లో చేరడానికి వెళ్లాడని తెలిపింది. సిరాజ్, వ్యాపారవేత్త కాగా, రెహ్మాన్ మెడికల్ ప్రాక్టిషినర్ గా పనిచేశాడు. తామంతా ఐసిస్ లో చేరడానికి వెళ్లినట్టు అష్ఫాక్ తన తమ్ముడికి మెసేజ్ పంపాడు.
తన కుటుంబ సభ్యుల అదృశ్యంపై అబ్దుల్ మజీద్ ఆగస్టు 6 పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఐసిస్ లో చేరడానికి ఇస్లాం మతబోధకుడు మహ్మద్ హనీఫ్ కేరళకు చెందిన స్కూల్ టీచర్ అబ్దుర్ రషీద్, నవీ ముంబైకి చెందిన ఆర్షీ ఖురేషీ, కళ్యాణ్ ప్రాంతవాసి రిజ్వాన్ ఖాన్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనీఫ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.