అత్యధిక లాభాల కోసం ఆశపడి మోసగాళ్ల చేతికి చిక్కిన ఓ వ్యక్తి కోటి రూపాయలకు పైగా పోగొట్టుకున్న సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని ఖర్ఘర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తిని షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడులు ఇప్పిస్తామని నమ్మించి రూ.1.07 కోట్లు కాజేశారు కేటుగాళ్లు.
దీనిపై దర్యాప్తులో భాగంగా ఆదివారం ఒక యాప్, వెబ్‌సైట్ యజమానులతో సహా 15 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని నవీ ముంబై జిల్లా ఖర్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన బాధితుడికి ఫిబ్రవరి 13 నుంచి మే 5 మధ్య పలుమార్లు ఫోన్ వచ్చింది. షేర్ ట్రేడింగ్ ద్వారా అధిక రాబడి వచ్చేలా చేస్తామని నమ్మించి వివిధ బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయడానికి అతన్ని ఒప్పించారని నవీ ముంబై సైబర్ పోలీసు సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
మోసగాళ్లను నమ్మిన బాధితుడు మొత్తం రూ.1,07,09,000 వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశాడు. తర్వాత తాను ఇన్వెస్ట్ చేసిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment