ట్రేడింగ్ స్కామ్‌.. రూ.1.07 కోట్లు మాయం - ఎక్కడంటే? | Man Loses Rs 1 07 Crore In Trading Scam | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్ స్కామ్‌.. రూ.1.07 కోట్లు మాయం - ఎక్కడంటే?

Published Tue, May 28 2024 8:02 AM | Last Updated on Tue, May 28 2024 1:58 PM

Man Loses Rs 1 07 Crore In Trading Scam

టెక్నాలజీ పెరుగుతున్న వేళ సైబర్ మోసాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటీవల నవీ ముంబైలోని ఖార్ఘర్ టౌన్‌షిప్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి షేర్ ట్రేడింగ్ స్కామ్‌లో రూ.1.07 కోట్లు మోసపోయారు. విచారణలో భాగంగా ఓ యాప్, వెబ్‌సైట్ యజమానులతో సహా 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సైబర్ మోసాలు కొత్తేమీ కాదు. అమాయక ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు నమోదైన వివిధ సైబర్‌క్రైమ్‌ కేసుల్లో ఇన్వెస్టర్లు రూ.1,762 కోట్లు నష్టపోయినట్టు ఇండియన్‌ సైబర్‌క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ (14సీ) వివరాలు చెబుతున్నాయి. ఇందులో ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మోసాలు మాత్రమే కాకుండా.. గేమింగ్ యాప్స్, చట్ట విరుద్ధమైన లోన్ యాప్స్, ఓటీపీలను ఇతరులకు షేర్ చేయడం వంటివి ఉన్నాయి.

ఇటీవల నవీ ముంబైలో సైబర్ మోసానికి ఎరగా చిక్కిన వ్యక్తిని మోసగాళ్లు ఫిబ్రవరి 13 నుంచి మే 5 వరకు పలుమార్పు కలిసి షేర్ ట్రేడింగ్ నుంచి లాభాలను ఇప్పిస్తామని నమ్మించారు. ఆ తరువాత వివిధ బ్యాంక్ అకౌంట్లలో రూ. 10709000 డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు డిపాజిట్ చేయించుకున్న తరువాత ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయారు. దీంతో మోసపోయామని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచార సాంకేతిక చట్టంలోని నిబంధనలతో పాటు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 419 (వ్యక్తిగతంగా మోసం చేయడం), 420 (చీటింగ్) వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మొత్తం కేసులు
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( I4C ) ప్రకారం.. 2023లో 1 లక్షకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్ కేసులు నమోదయ్యాయి. ట్రేడింగ్ స్కామ్‌ల ద్వారా మోసపోయిన వారు 20,043 కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. డేటింగ్ యాప్‌ల వల్ల మోసపోయిన వారి సంఖ్య 1725గా నమోదైంది. ఇలా వివిధ రూపాల్లో సైబర్ నేరగాళ్లు ప్రజలను మాయ చేస్తూ.. మోసం చేస్తున్నారు.

మోసగాళ్ల కొత్త అవతారాలు..
మోసగాళ్లు తమ ఫోన్ నంబర్‌లను చట్టబద్ధంగా కనిపించేలా చేయడానికి తరచుగా కాల్ స్పూఫింగ్‌ ఉపయోగిస్తారు. స్కామర్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వంటి ఏజెన్సీల అధికారులుగా నటిస్తారు. ఇది నిజమని నమ్మి ప్రజలు మోసపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement