ఐసిస్ ఉగ్రవాది అరెస్టు.. పేలుళ్ల కుట్ర భగ్నం
తమిళనాడులోని పలు నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నిన ఐసిస్ ఉగ్రవాదిని ఎన్ఐఏ వర్గాలు అరెస్టుచేశాయి. తిరునల్వేలి జిల్లా కడయనల్లూరులో ఉగ్రవాది సుబహానీ హజా మొయద్దీన్‌ను అరెస్టు చేశారు. బుధవారమే అరెస్టు చేసిన అతడి నుంచి పలు కీలక వివరాలను ఎన్ఐఏ రాబట్టింది. గతంలో విజిటర్ వీసాపై ఇస్తాంబుల్ వెళ్లిన మొయొద్దీన్.. అక్కడ అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ దేశీయులను కలిశాడు. అక్కడినుంచి నేరుగా ఇరాక్ వెళ్లి ఐసిస్‌లో చేరాడు. ఇరాక్‌లోని మోసుల్ నగరంలో ఐసిస్ తరఫున పనిచేశాడు. అందుకుగాను అతడికి ఐసిస్ నెలకు 100 డాలర్లు చెల్లించేది.
అయితే, భద్రతా దళాలు చేసిన షెల్ దాడిలో మొయిద్దీన్ కళ్ల ముందే అతడి సహచరులు ఇద్దరు హతమయ్యాచు. దాంతో ఐసిస్‌ను వదిలిపెట్టాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఐసిస్ తనను బంధించి, హింసించిందని కూడా చెప్పాడు. తర్వాత సిరియాలో్ని రఖ్కా ప్రాంతానికి తరలించి, తర్వాత విడిచిపెట్టింది. ఐదుగురు సహచరులతో కలిసి అతడు మళ్లీ టర్కీ చేరుకున్నాడు. అక్కడ భారత కాన్సులేట్‌ను ఆశ్రయించి, అత్యవసర పత్రాలతో 2015 సెప్టెంబర్ 22న ముంబై చేరాడు.
కొంతకాలం తమిళనాడు కడయనల్లూరులోని ఒక బంగారం దుకాణంలో పనిచేశాడు. తర్వాత మళ్లీ ఐసిస్ వర్గాలు అతడితో సంప్రదింపులు జరిపాయి. దాంతో శివకాశిలో పేలుడు పదార్థాలు సేకరించడానికి అతడు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తద్వారా వాటితో తమిళనాడులో విధ్వంసం సృష్టించాలని ప్లాన్ పన్నాడు. చెన్నై, కోయంబత్తూరు సహా పలు నగరాల్లో రెక్కీలు నిర్వహించాడు. అతడి గురించి పక్కా సమాచారం అందుకున్న ఎన్ఐఏ వర్గాలు అతడిని అరెస్టుచేసి ఎర్నాకులం కోర్టులో ప్రవేపశపెట్టాయి.