ఆ ఉగ్రవాదిని హతమార్చారు!
మిలాన్: జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలో ట్రక్కుతో దాడి చేసి 12 మందిని పొట్టనబెట్టుకున్న ఘటనలో అనుమానిత ఉగ్రవాదిని పోలీసులు హతమార్చారు. శుక్రవారం ఇటలీలో ఉత్తరాదిన ఉన్న మిలాన్ నగరంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు మరణించినట్టు భద్రతాదళ అధికారులు చెప్పారు. మృతుడ్ని ట్యునీసియాకు చెందిన 24 ఏళ్ల అనిస్ అమ్రిగా పోలీసులు భావిస్తున్నారు. కాల్పుల ఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఇటలీ మేగజైన్ పనోరమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.
ఇటీవల బెర్లిన్‌లోని రద్దీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్‌లో దుండగుడు ట్రక్కుతో విధ్వంసం సృష్టించడంతో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడింది తమ సైనికుడే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి ఓ పాకిస్తాన్ వ్యక్తిని పోలీసులు మొదట అరెస్ట్ చేసినా.. తర్వాత దాడికి పాల్పడింది అతడుకాదని భావించి వదిలేశారు.