చర్చిలపై దాడులకు ఐసిస్ సిద్ధం?
చర్చిలపై దాడులకు ఐసిస్ సిద్ధం?
Published Sat, Dec 24 2016 11:04 AM | Last Updated on Mon, Oct 1 2018 5:16 PM
ఒకవైపు క్రిస్మస్, మరోవైపు కొత్త సంవత్సరం వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతున్న నేపథ్యంలో అమెరికాలోని చర్చిలపై ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఎఫ్‌బీఐ హెచ్చరించింది. అమెరికాలో ఉన్న చర్చిలపై దాడులు మొదలుపెట్టాలంటూ ఇస్లామిక్ స్టేట్ తన సానుభూతిపరులకు ఆన్‌లైన్‌లో సందేశాలు పంపుతుండగా, వాటిని ఎఫ్‌బీఐ మధ్యలోనే ఇంటర్‌సెప్ట్ చేసింది.
టర్కీలో రష్యా రాయబారిని ఒక ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది కాల్చి చంపి.. బెర్లిన్‌లో క్రిస్మస్ మార్కెట్లోకి ట్రక్కును పంపించి, డజను మందిని చంపిన తర్వాత.. ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యంపైనే గురిపెట్టినట్లు తెలుస్తోంది. జర్మనీ దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించుకుంది. తమకు అందిన సమాచారాన్ని ఎఫ్‌బీఐ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. అయితే కచ్చితంగా ఎక్కడ దాడులు జరగొచ్చన్న విషయం గురించి మాత్రం రాష్ట్రాల అధికారులు ఎవరికీ ఎలాంటి సమాచారం లేదు. కాగా, జర్మనీ మార్కెట్లోకి ట్రక్కును తీసుకెళ్లి, పలువురిని తొక్కించి చంపేసిన ట్యునీషియన్ ఉగ్రవాది అనిస్ అమ్రీ... ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన పోలీసు కాల్పుల్లో హతమయ్యాడు.
Advertisement