సెక్స్ బానిసల వినియోగంపై ఐఎస్‌ఐఎస్ ఫత్వా!
మహిళా బానిసలతో వారి యాజమానులు ఎలా శృంగారం జరుపాలనే విషయమై పూర్తి వివరణతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జారీచేసిన ఫత్వా (ఉత్తర్వు) ఒకటి వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలోని ఇరాక్, సిరియాలో మహిళలపై పెచ్చుమీరుతున్న లైంగిక హింస జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఫత్వా ప్రాధాన్యం సంతరించుకుంది. బందీలుగా చిక్కిన మహిళల విషయంలో తాము పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండేందుకు ఐఎస్‌ఐఎస్ ఈ ఫత్వా జారీచేసినట్టు కనిపిస్తున్నది. తమ నియంత్రణలోని ఇరాక్, సిరియాలో మహిళల లైంగిక బానిసత్వాన్ని సమర్థించేందుకు వీలుగా శతాబ్దాల కిందటి బోధనలకు ఆ గ్రూప్ కొత్త భాష్యం చెప్తున్నదని, ఈ విషయంలో చట్టబద్ధ ఉత్తర్వుగా ఫత్వాను జారిచేసిందని ముస్లిం స్కాలర్ ఒకరు తెలిపారు.
ఒక మహిళ బానిసతో తండ్రి, కొడుకు ఇద్దరూ శృంగారం జరుపడం, ఒక యాజమాని తన బానిసలైన తల్లి, కూతురు ఇద్దరితోనూ లైంగికంగా గడుపడం నిషేధిస్తున్నట్టు ఈ ఫత్వా పేర్కొంది. అయితే ఒక మహిళకు ఇద్దరు యాజమానులు ఉంటే ఆ ఇద్దరూ ఆమెతో గడుపవచ్చునని, ఆమెను వారి ఉమ్మడి భాగస్వామ్య ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని ఫత్వా వెల్లడించింది.
12 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన బాలికలు, మహిళలను అపహరించి.. వారిపై లైంగిక అకృత్యాలకు పాల్పడటం ఇస్లామిక్ స్టేట్ వ్యవస్థీకృత చర్యగా మార్చిందని, ముఖ్యంగా ఉత్తర ఇరాక్‌లోని మైనారిటీ తెగ అయిన యాజిది మహిళలను పెద్ద ఎత్తున అపహరిస్తూ ఆగడాలకు పాల్పడుతున్నదని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవహక్కుల సంస్థలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా అపహరించిన మహిళలను తన ఫైటర్లకు బహుమతిగా ఇవ్వడమో, లేక వారిని లైంగిక బానిసలుగా అమ్మివేయడమో ఐఎస్ఐఎస్ చేస్తున్నది. ఈ దుర్మార్గమైన కార్యకలాపాలను ఐఎస్ఐఎస్ బాహాటంగానే నిర్వహిస్తున్నది.
ఇందుకోసం ఆ గ్రూపు ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి లైంగిక బానిసల నిర్వహణ అంశాన్ని పర్యవేక్షిస్తున్నది. గత ఏప్రిల్‌లో ఇస్లామిక్ స్టేట్ కబంధ హస్తాల నుంచి తప్పించుకొన్న 20 మంది యువతులు తాము ఎంతటి లైంగిక హింసను ఎదుర్కొన్నారో కళ్లకు కట్టినట్టు వివరించారు. ఇస్లామిక్ స్టేట్‌కి చెందిన పరిశోధన, ఫత్వా కమిటీ 2015 జనవరి 29న ఈ ఫత్వా (64) జారీచేసింది. గత మేలో సిరియాలోని ఐఎస్ ఉన్నతాధికారి ఇంట్లో అమెరికా ప్రత్యేక బలగాలు జరిపిన దాడిలో దొరికిన భారీ పత్రాల్లో ఈ ఫత్వా కూడా ఉంది.