ఐసీస్‌పై పోరులో భాగంగా సంభవిస్తున్న పరిణామాల కారణంగా సొంత దేశంలోనే శరణార్థులుగా మారిన ఇరాకీ మహిళలకు ఆదరణ లభించకపోగా, వారిపై పెద్ద ఎత్తున íహింస, లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయి!‘‘ప్రతిరోజూ నన్ను నేను రక్షించుకోవడం గగనమైపోతోంది. నాలుగు గోడలు, ఒకే తలుపు ఉన్న చిన్న గది ఉంటే చాలు. లోపలి నుంచి తాళం వేసుకుంటే బతికిపోతానని అనుకుంటాను. ఏ రోజుకు ఆ రోజు ఇదే నా చివరి రాత్రి అనుకుంటాను’’
గుండెలు పిండేసేలా ఉన్న ఓ బాధిత మహిళ తానున్న స్థితి గురించి చెప్పిన మాటలివి! ‘‘అసలు నేనెందుకు ఇంకా బతికి ఉన్నాను? ఐసీస్‌పై పోరులో జరిగిన వైమానిక దాడుల్లోనే చనిపోకుండా ఎందుకింకా బతికున్నాను?’’ అంటూ ఆమె వాపోతోంది. ‘‘నేను జైలులో ఉన్నట్టే అనుకుంటున్నాను. భర్త, తండ్రి మరెవరూ లేక ఏకాకిగానే భావిస్తున్నాను. ఈ ఒత్తిళ్లు ఎదుర్కోలేక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ పిల్లల మొహం గుర్తుకు వచ్చి ఆగిపోయాను’’ అని అంటోంది! ఆమె ఒక్కరే కాదు, ఇరాక్‌లోని సహాయ, పునరావాస శిబిరాల్లోని మొసుల్ ప్రాంత మహిళలు, ముఖ్యంగా ఐసీస్‌తో సంబంధాలున్నట్టు భావిస్తున్న వారి కుటుంబ సభ్యులు.. సంక్షోభ ప్రాంతాల్లో తీవ్రమైన హింస, పీడనలు ఎదుర్కొంటున్నారు.
రక్షకులే భక్షకులౌతున్నారు!
ఇస్లామిక్ స్టేట్ (ఐసీస్) తీవ్రవాదులతో కుటుంబ సంబంధాలున్నాయన్న అనుమానాలపై ఇరాకీ మహిళలు అత్యాచారాలు మొదలుకుని వివిధ రూపాల్లో లైంగిక హింసకు, దోపిడీకి గురవుతున్నారు. ఇరాక్‌లోని అంతర్గత శరణార్థ ప్రజల (ఇంటర్నల్ డిస్‌ప్లేస్‌డ్ పీపుల్) శిబిరాల్లోనూ వీరికి వేధింపులు తప్పడం లేదు. ఐసీస్‌పై పోరులో భాగంగా సంభవిస్తున్న పరిణామాల కారణంగా తమ సొంత దేశంలోనే శరణార్థులుగా మారిన ఆడవారికి ఆదరణ లభించాల్సిన చోటే పెద్ద ఎత్తున హింసకు, లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి దురదృష్టకర పరిస్థితులు ఎదుర్కొంటున్న మహిళల కోసం ఏర్పాటు చేసిన శిబిరాల్లోనే; సహాయ, సహకారాలు అందించి చేదోడు వాదోడుగా నిలవాల్సిన వారే ఈ లైంగిక దోపిడీకి తెరతీస్తున్నారు! బాధితులను తిరిగి తమ సొంత గ్రామాలు, ప్రాంతాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. కొందరు కష్టం మీద ఇళ్లకు చేరుకున్నా వారికీ ఇక్కట్లు తప్పడం లేదు. వారి ఇళ్లపై ఐసీస్ అంటూ ముద్ర వేయడంతో పాటు కరెంట్, నీళ్లు, ఇతర సర్వీసులు కట్ చే సేస్తున్నారు.
దుర్భర స్థితిపై ఆమ్నెస్టీ నివేదిక
ఇరాక్‌లోని ఎనిమిది క్యాంప్‌లను పరిశీలించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అక్కడ నెలకొన్న పరిస్థితులను ఓ నివేదికలో కళ్లకు కట్టినట్టుగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ క్యాంపుల్లోని 92 మంది మహిళలను కలుసుకుని వారి జీవన స్థితిగతులపై ఆరా తీసింది. వీరంతా కూడా తమ బాధామయ జీవితాన్ని, తమకు ఎదురైనా ఘోరమైన అనుభవాలను పూసగుచ్చినట్టు వివరించారు. యుద్ధంలో ఐసీస్‌కు తగిలిన ఎదురుదెబ్బ కారణంగా మొసుల్ నుంచి పారిపోతున్న క్రమంలో ఈ మహిళల భర్తలు మరణించడం, అరెస్ట్ కావడం, లేదా కనిపించకపోవడం వంటి ఘటనలు పెద్ద సంఖ్యలోనే చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది ఆడవాళ్లు తమ కుటుంబాలను తామే నిర్వహించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారిపైన కూడా సహాయం పేరిట అఘాయిత్యాలు జరుగుతున్నాయి.
రోదనలు, పెడబొబ్బలు
ఈ సహాయ, పునరావాస శిబిరాల్లోని మహిళలు అత్యాచారానికి, లైంగిక హింసకు గురవుతున్న సమయంలో అరుపులు,పెడబొబ్బలు వినిపించేవని ఆమ్నెస్టీకి అక్కడి మహిళలు తెలియజేశారు. రక్షణ, ఆహారం, నీళ్లు, ఇతర రూపాల్లోని మానవతా సహాయం, అత్యవసరాల కోసం డబ్బు.. అందివ్వడానికి ప్రతిఫలంగా నిర్బంధ శారీరక సుఖం కోసం ఇక్కడి మహిళలపై సైనికులు, శిబిరాల్లోని సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారని ఓ మహిళ వాపోయింది. ఈ శిబిరాల్లోని మహిళలంతా కూడా తమ రక్షణ, భద్రత గురించి ఇదే విధమైన భయాందోళనలు వ్యక్తం చేశారు.
మహిళలపై హింస, లైంగికదాడుల నివారణకు ఇరాకీ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ శిబిరాల్లో అమానుషమైన పద్ధతుల్లో దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ క్యాంప్‌ల్లోకి మగవారెవరూ అడుగు పెట్టకుండా నిరోధించాలి.
– లిన్ మాలౌఫ్, డైరెక్టర్, ఆమ్నెస్టీ మిడిల్ ఈస్ట్ రీసెర్చ్
– కె.రాహుల్, సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment