250 మంది మహిళల శిరచ్ఛేదం
ఇరాక్‌లో ఐసిస్ దారుణం
* సెక్స్ బానిసలుగా నిరాకరించినందుకే ఈ ఘాతుకం
లండన్: ఇరాక్‌లో ఐసిస్ మరోదారుణానికి తెగబడింది. ఐసిస్‌లో పనిచేస్తున్న వారికి సెక్స్ బానిసలుగా ఉండేందుకు నిరాకరించిన 250 మంది ఇరాక్‌కు చెందిన మహిళలను ఐసిస్ అతి కిరాతకంగా తలల్ని నరికి హతమార్చింది. ఇరాక్‌లోని రెండో అతిపెద్ద పట్టణమైన మౌసోలిలో ఈ అఘాయిత్యం జరిగింది. 2014 జూన్‌లో ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పటినుంచీ అందులో పనిచేస్తున్న ఉగ్రవాదులకు తాత్కాలిక వివాహం పేరుతో అక్కడి మహిళల్ని సెక్స్ బానిసలు ఉండాలని ఐసిస్ ఆదేశాలు జారీ చేసింది.
అయితే దీన్ని ఉల్లంఘించినందుకే ఆ మహిళల్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే హతమార్చినట్లు కుర్దిష్ డెమోక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి మమూజిని మీడియాకు తెలిపారు. ఐసిస్ ప్రభావిత ప్రాంతాల్లో భారీ ఎత్తున మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. ప్రత్యేకంగా మహిళలెవరికీ తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే స్వేచ్ఛకూడాలేకుండా పోయిందని పేట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ పార్టీకి చెందిన నేత ఘయాస్ సర్చీ తెలిపారు. 2014 ఆగష్టులో 500 మందికి పైగా యాజిది మహిళల్ని అపమరించి ఐసిస్‌కు సెక్స్ బానిసలుగా మార్చారు. గత అక్టోబర్‌లో సింజర్‌లో 500 మంది యువతుల్ని అపహరించారు.
ఐసిస్‌పై పోరుకు కలసిరండి: ఒబామా
రియాద్: ఐసిస్‌పై పోరుకు గల్ఫ్ దేశాలు కలసిరావాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చారు. సౌదీఅరేబియాలోని రియాద్‌లో గురువారం ప్రారంభమైన అరబ్‌దేశాల ప్రాంతీయ సదస్సుకు ఒబామా హాజరయ్యారు. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ వివిధ ప్రాంతాలను స్వాధీనం చేసుకుందని.. ఐసిస్‌పై పోరుకు గల్ఫ్ దేశాలు కలసికట్టుగా రావాలన్నారు. మౌసోలిని ఈ ఏడాది చివరికల్లా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.