ఇస్లామిక్ స్టేట్కు దెబ్బ మీద దెబ్బ
వాషింగ్టన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థకు చెందిన టాప్ లీడర్ను అమెరికా మట్టుబెట్టింది. ఉగ్రవాదుల తాకిడి అధికంగా ఉండే అన్బార్ ప్రావిన్స్ చీఫ్ ఉన్న అబూ వాహిబ్ అనే ఉగ్రవాది, మరో ముగ్గురు అనుచరులు అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో హతమయ్యారు. ఈ విషయం పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ పీటర్ కుక్ తెలిపారు. అబు వాకర్ ఒకప్పుడు అల్ కాయిదా ఉగ్రవాద సంస్థలో సభ్యుడిగా ఉండేవాడు.
అనంతరం ఇస్లామిక్ స్టేట్ లో చేరి పలు దాడులకు ఎన్నో ప్రణాళికలు రచించారు. దీంతో అతడినే లక్ష్యంగా చేసుకున్న అమెరికా వైమానిక బలగాలు అతడి జాడను గుర్తించి రూత్బా అనే ప్రాంతంపై దాడులు నిర్వహించగా అతడు ప్రాణాలుకోల్పోయాడు. నాయకత్వం లేకుండా చేస్తే ఆ ఉగ్రవాద సంస్థను పూర్తిగా నాశనం చేయొచ్చన్న తమ వ్యూహంలో భాగంగా అమెరికా వాయు సేనలతో కలిసి చేస్తున్న దాడులతో సాధించిన ఈ విజయం మరో గొప్ప అంశమని, మున్ముందు ఇలాంటివి మరిన్ని చేస్తామని ఇరాక్ సైనికాధికారి ఒకరు చెప్పారు.